మోదీ తన జీవితంలో ఎప్పుడూ  రాజ్యాంగం చదవలే : రాహుల్ గాంధీ

మోదీ తన జీవితంలో ఎప్పుడూ  రాజ్యాంగం చదవలే : రాహుల్ గాంధీ
  • అందుకే అందులో ఏముంటుందో ఆయనకు తెల్వదు: రాహుల్ గాంధీ   
  • రాజ్యాంగం కాపీపై కామెంట్లు చేస్తూ దేశ మహామహులను బీజేపీ అవమానిస్తున్నదని ఫైర్  
  • మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలో స్పీచ్    

నందుర్బార్/నాందేడ్ : రాజ్యాంగాన్ని బీజేపీ అగౌరవపరుస్తున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రధాని మోదీ తన జీవితంలో ఎప్పుడూ రాజ్యాంగాన్ని చదవలేదని విమర్శించారు. అందుకే తాను తీసుకెళ్తున్న రాజ్యాంగం కాపీ (బుక్) ఖాళీగా ఉందంటూ మోదీ విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గురువారం మహారాష్ట్రలోని నందుర్బార్, నాందేడ్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో రాహుల్ పాల్గొని మాట్లాడారు. ర్యాలీల్లో ఆయన చూపెడుతున్న రాజ్యాంగం కాపీపై బీజేపీ చేస్తున్న కామెంట్లకు ఈ సందర్భంగా కౌంటర్ ఇచ్చారు.

‘‘నేను క్యారీ చేస్తున్న రాజ్యాంగం కాపీ రెడ్ కలర్ లో ఉందంటూ బీజేపీ కామెంట్లు చేస్తున్నది. కానీ మాకు కలర్ ముఖ్యం కాదు. రాజ్యాంగాన్ని కాపాడడమే ముఖ్యం. దాని కోసం ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాం. నేను క్యారీ చేస్తున్న రాజ్యాంగం కాపీ ఖాళీగా ఉందని మోదీ అనుకుంటున్నారు. ఎందుకంటే ఆయనెప్పుడూ అది చదవలేదు. అందులో ఏముంటుందో ఆయనకు తెలియదు” అని  చురకలు అంటించారు. ‘‘మోదీజీ.. నేను క్యారీ చేస్తున్న రాజ్యాంగం కాపీ ఖాళీగా లేదు. అది మన దేశ ఆత్మ. అందులో ఎంతో జ్ఞానం ఉంది. బిర్సా ముండా, మహాత్మ పూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ లాంటి మహామహుల సిద్ధాంతాలు ఉన్నాయి.

మీరు ఈ కాపీ ఖాళీగా ఉందంటే.. ఆ మహామహులను అవమానించినట్టే” అని అన్నారు. ‘‘రాజ్యాంగాన్ని నాశనం చెయ్యాలన్నదే బీజేపీ ఉద్దేశం. కానీ ఆ విషయం ఓపెన్ గా చెప్పదు. ఎందుకంటే దేశమంతా తిరగబడుతుంది” అని పేర్కొన్నారు. కాగా, రాహుల్ తన ర్యాలీల్లో ప్రజలకు చూపిస్తున్న రాజ్యాంగం కాపీలోని పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయంటూ.. అది రెడ్ కలర్ లో ఉంది కాబట్టి అర్బన్ నక్సల్స్ కు రాహుల్ మద్దతు ఇస్తున్నారంటూ బీజేపీ విమర్శలు చేస్తున్నది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతల కామెంట్లకు రాహుల్ కౌంటర్ ఇచ్చారు. 

కులగణన చేయాల్సిందే.. 

దేశంలో కులగణన చేయాల్సిందేనని, అప్పుడే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని  రాహుల్ స్పష్టం చేశారు. కేంద్రంలో ముఖ్యమైన 90 మంది ఆఫీసర్లలో ఆదివాసీ ఒక్కరే ఉండగా.. దళితులు ముగ్గురు, ఓబీసీలు ముగ్గురే ఉన్నారన్నారు. ఆదివాసీలు, దళితులు, ఓబీసీలకు ప్రాధాన్యమైన పోస్టులు దక్కడం లేదని పేర్కొన్నారు. ‘‘మన దేశానికి ఆదివాసీలే మొదటి ఓనర్లు. జల్, జంగిల్, జమీన్ పై వాళ్లకే మొదటి హక్కు ఉంది. కానీ ఆదివాసీలకు ఎలాంటి హక్కులు ఉండకూడదని, వాళ్లు అడవికే పరిమితం కావాలని బీజేపీ అనుకుంటున్నది” అని మండిపడ్డారు.

ముంబై ప్రాజెక్టులు గుజరాత్​కు తరలిస్తారా?: జైరాం

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంబైలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ విరుచుకుపడింది. దాదాపు 200 ఏండ్లుగా దేశ ఆర్థిక రాజధానిగా ముంబై ఉన్నా.. కేవలం గుజరాత్​లోని గిఫ్ట్​ సిటీలో మాత్రమే అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం(ఐఎఫ్​ఎస్​సీ) ఎందుకు ఏర్పాటు చేశారని ప్రశ్నించింది. పెద్ద పెద్ద ప్రాజెక్టులు ముంబైలో ఏర్పాటు చేయకుండా.. గుజరాత్​కు ఎందుకు తరలించారని కాంగ్రెస్​ నేత జై రాం రమేశ్​ నిలదీశారు.

అదానీ ధారవి భూసేకరణకు  బీజేపీ ఎందుకు స్పాన్సర్ చేస్తున్నదని అడిగారు.  ఓడిపోతామన్న భయంతోనే బృహన్​ముంబై మున్సిపల్​ కార్పొరేషన్​ (బీఎంసీ) ఎన్నికలు మహాయుతి గవర్నమెంట్ వాయిదా వేస్తున్నదని అన్నారు. ముంబైలో వాయు కాలుష్యం తీవ్రంగా పెరిగిపోయినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు.  మరాఠ్వాడాలో నీటి ఎద్దడిని తీర్చడంలో మోదీ విజన్​ ఏంటో చెప్పాలన్నారు.