పనాజీ: కాంగ్రెస్ పార్టీ వల్లే ప్రధాని నరేంద్ర మోడీ మరింత శక్తిమంతంగా తయారువుతన్నారని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. బీజేపీకి కాంగ్రెస్ ప్రచారకర్తలా మారిందని ఆమె విమర్శించారు. గోవా ఫార్వర్డ్ పార్టీతో పొత్తు గురించి చర్చిందేందుకు జీవోఏ చీఫ్ విజయ్ సర్దేశాయ్‌తో మమత చర్చించారు. ఈ సందర్భంగా ఆమె పైవ్యాఖ్యలు చేశారు. ప్రాంతీయ పార్టీలు బలంగా మారాలని తాను కోరుకుంటున్నానని దీదీ అన్నారు. ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం కూడా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నారు.
ప్రతిపక్ష పార్టీగా సమర్థంగా వ్యవహరించడంలో కాంగ్రెస్ విఫలమైందని టీఎంసీ అధినేత్రి మమత అన్నారు. అదే సమయంలో బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ప్రాంతీయ పార్టీలతో కలసి బలమైన కూటమిని ఏర్పాటు చేయలేకపోయిందన్నారు. ‘మోడీజీ మరింత శక్తిమంతంగా తయారవుతున్నారు. దీనికి కాంగ్రెస్ పార్టీనే కారణం. బీజేపీకి టెలివిజన్ రేటింగ్స్ పాయింట్స్‌ను తీసుకొస్తోంది కాంగ్రెస్సే. ఒకవేళ కాంగ్రెస్ సరైన నిర్ణయం తీసుకోకుంటే ఈ దేశం ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు’ అని దీదీ అన్నారు. గోవా ఎలక్షన్స్‌లో కాంగ్రెస్‌తో జట్టు కడతారా అన్న ప్రశ్నకు.. అలాంటి ఉద్దేశం లేదని మమత అన్నారు. ‘పొత్తు గురించి నేను కాంగ్రెస్‌తో చర్చించను. అది నా పార్టీ కాదు. ఎవరి మద్దతు లేకుండా నేను ఓ ప్రాంతీయ పార్టీని నడిపిస్తున్నా. మేం ప్రజల మద్దతుతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఇతర పార్టీల గురించి నేను మాట్లాడను. పొత్తుల విషయంలో వాళ్లే డిసైడ్ చేసుకోవాలి’ అని దీదీ చెప్పారు.