యూఎస్‌లో భారత బిడ్డపై కాంగ్రెస్ దాడి..
ఇదేనా మొహబ్బత్ కీ దుకాన్?
విదేశీ గడ్డపై ఇండియన్ జర్నలిస్ట్‌కు కాంగ్రెస్ అవమానం: మోదీ
రాజ్యాంగం అనే పదం ఆ పార్టీకి ఏమాత్రం నప్పదు
జమ్మూకాశ్మీర్‌లో టెర్రరిజం అంతం.. ఇక కర్ఫ్యూలు ఉండవ్
త్వరలోనే రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని హామీ
దోడాలో బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని ప్రసంగం
శ్రీనగర్: విదేశీ గడ్డపై భారత బిడ్డను కాంగ్రెస్ పార్టీ అవమానించిందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. అమెరికాలో ఇండియన్జర్నలిస్ట్పై కాంగ్రెస్అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ టీమ్దాడికి పాల్పడిందన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని దోడాలో శనివారం బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. అమెరికాలో ఇండియా టుడే జర్నలిస్ట్‌పై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. ఇటీవల రాహుల్‌గాంధీ అమెరికాలో పర్యటించిన సమయంలో డల్లాస్‌లో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చీఫ్శ్యామ్ పిట్రోడాను ఇండియా టుడే జర్నలిస్ట్ఇంటర్యూ చేశారు.
బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడుల గురించి రాహుల్ మాట్లాడతారా? అని అడగ్గా.. అక్కడే ఉన్న కాంగ్రెస్ మద్దతుదారులు అభ్యంతరం వ్యక్తంచేస్తూ అతడిపై దాడి చేసినట్టు కథనాలు వెలువడ్డాయి. ఈ ఘటనపై మోదీ స్పందించారు. వాక్ స్వాతంత్య్రానికి సారథులుగా చెప్పుకొనేవారే క్రూరంగా వ్యవహరించారని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ‘‘వారు మొహబ్బత్ కీ దుకాన్ నడుపుతున్నట్టు ప్రచారం చేసుకుంటారు.. కానీ అమెరికాలో ఇండియన్ జర్నలిస్ట్‌ను అవమానించారు. ప్రజాస్వామ్యానికి పిల్లర్ అయిన మీడియా జర్నలిస్ట్‌ను రూంలో బంధించి హింసిస్తారా? ఈ ఘటన విదేశీ గడ్డపై భారత ప్రతిష్టను తగ్గించింది. రాజ్యాంగం అనే పదం కాంగ్రెస్‌కు ఏమాత్రం సరిపోదు” అని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ నిజాయతీ లేని పార్టీ
కాంగ్రెస్ నిజాయతీ లేని పార్టీ అని, అవినీతి, వారసత్వానికి నాయకత్వం వహిస్తున్న ఆ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికలను మానిప్యులేట్ చేస్తున్నదని మోదీ ఆరోపించారు. ఆ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో కొద్దిరోజుల్లోనే ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ తప్పుడు వాగ్దానాలు ఇచ్చిందని, ఇందుకు హిమాచల్ ప్రదేశ్ ఉదాహరణ అని పేర్కొన్నారు.
కాగా, తమకు మరో 20 సీట్లు వచ్చి ఉంటే చార్సౌ పార్(400 సీట్లు) అని ప్రచారం చేసుకున్నవాళ్లు జైల్లో ఉండేవారంటూ ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై మోదీ మండిపడ్డారు. వారు కేంద్రంలో అధికారంలోకి రావాలనుకున్నది ప్రజలను జైలుకు పంపడానికా..? లేక ప్రజల కోసం పని చేయడానికా..? అని ప్రశ్నించారు. తాము ప్రజా సంక్షేమం కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు ప్రధాని స్పష్టం చేశారు.
టెర్రరిజం అంతమవుతున్నది..
జమ్మూకాశ్మీర్‌లో టెర్రరిజం అంతమవుతున్నదని ప్రధాని మోదీ అన్నారు. ఇక ఇక్కడ అప్రకటిత కర్ఫ్యూలు ఉండవని, ఆ రోజులు ముగిసిపోయాయని తెలిపారు. ఈ అందమైన ప్రాంతాన్ని నాశనం చేసిన వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టేందుకు తమ పార్టీ కొత్త నాయకత్వాన్ని ముందుకు తెస్తున్నదని తెలిపారు. టెర్రరిజాన్ని తుడిచిపెట్టాలన్న పార్టీ ‘సంకల్పాన్ని’ ప్రతిబింబించేందుకే ఉగ్రవాద బాధితుడు షగున్ పరిహార్‌కు టికెట్ఇచ్చామని చెప్పారు. తాము అధికారంలోకి రాగానే జమ్మూకాశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని పునరుద్ఘాటించారు.
ఈ ఎన్నికలు జమ్మూకాశ్మీర్ భవిష్యత్తును నిర్ణయించనున్నాయని చెప్పారు. ‘‘స్వాతంత్య్రం వచినప్పటి నుంచీ ఈ ప్రాంతాన్ని విదేశీయులు లక్ష్యంగా చేసుకున్నారు. ఆ తర్వాత వారసత్వ రాజకీయాలు ఈ ప్రాంతాన్ని వంచించాయి. వారసుల భవిష్యత్తు గురించే నేతలు ఆలోచించారు. దీంతో జమ్మూకాశ్మీర్ యువత టెర్రరిజంతో బాధపడ్డారు. ఆ నేతలు మీ బాధలను వేడుకలా చూశారు” అని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ నేతలను ఉద్దేశించి మోదీ అన్నారు. ఆ పార్టీలను అధికారంలోకి తీసుకురావద్దని ప్రజలను కోరారు.
మోదీ ఇంట్లోకి కొత్త మెంబర్!
ప్రధాని మోదీ ఇంట్లోకి ఆదివారం ఒక కొత్త మెంబర్ అడుగుపెట్టింది. ఢిల్లీలోని 7 లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ప్రధాని అధికారిక నివాసంలో ఉన్న ఆవుకు లేగదూడ పుట్టింది. చూడ ముచ్చటగా ఉన్న ఆ లేగదూడకు దీప్ జ్యోతి అని మోదీ నామకరణం చేశారు. దీప్ జ్యోతిని పూజ గదిలోకి తీసుకెళ్లి శాలువా కప్పి, పూజలు చేశారు. అనంతరం దీప్ జ్యోతిని మోదీ ఆప్యాయంగా ఎత్తుకుని ముద్దాడారు. ‘‘మా ఇంటికి కొత్త మెంబర్ వచ్చాడు. ఇంట్లోని ఆవుకు లేగదూడ పుట్టింది. దాని నుదుటిపై దీపంలా గుర్తు ఉంది. అందుకే ఆ దూడకు దీప్ జ్యోతి అని పేరు పెట్టాను” అని మోదీ ట్వీట్ చేశారు. దానితో సరదాగా గడిపిన వీడియోను ఆయన షేర్ చేశారు.
హర్యానాలో బీజేపీకి హ్యాట్రిక్ ఖాయం..
హర్యానాలో బీజేపీకి హ్యాట్రిక్ ఇవ్వాలని ప్రజలు డిసైడ్ అయ్యారని ప్రధాని మోదీ అన్నారు. వచ్చే నెల 5న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి, మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. హర్యానాలోని కురుక్షేత్రలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని, ప్రసంగించారు. హర్యానాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి అంతా ఒక జిల్లాకే పరిమితమైందన్నారు. తాము అధికారంలోకి వచ్చాకే రాష్ట్రమంతటా సమానంగా డెవలప్ చేస్తున్నామని చెప్పారు. దేశంలో బీజేపీకి హ్యాట్రిక్ ఇచ్చారని, ఇక్కడ కూడా ఆదరించాలని కోరారు.