పాక్​ గగనతలంలో మోదీ విమానం.. అనుకోకుండా 46 నిమిషాలు ట్రావెల్ జర్నీ

పాక్​ గగనతలంలో మోదీ విమానం.. అనుకోకుండా 46 నిమిషాలు ట్రావెల్  జర్నీ

ఇస్లామాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ విమానం అనుకోకుండా పాకిస్తాన్ గగనతలం గుండా 46 నిమిషాలపాటు  ప్రయాణం చేసింది. పోలాండ్ పర్యటన ముగించుకుని తిరిగి భారత్ చేరే క్రమంలో ఆ దేశ ప్రధాని మోదీ తమ దేశ గగనతలాన్ని ఉపయోగించారని పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. మోదీ విమానం ఆదివారం ఉదయం 10.15 గంటలకు చిత్రాల్ మీదుగా పాక్ గగనతలంలోకి ప్రవేశించి.. ఇస్లామాబాద్, లాహోర్ మీదుగా 11:01 గంటలకు దేశం విడిచి వెళ్లినట్లు వివరించింది. అయితే, ఎయిర్ స్పేస్ ఉపయోగిస్తే గుడ్‌‌‌‌విల్ మెసేజ్ ఇవ్వాలనే సంపద్రాయాన్ని మోదీ మరిచారని పాక్ మీడియా పేర్కొంది. గుడ్‌‌‌‌విల్ మెసేజ్ తప్పనిసరి కాదని కూడా వెల్లడించాయి. 

ఒక ప్రధానమంత్రి విమానం ఒక దేశం మీదుగా ప్రయాణించడానికి ప్రత్యేక అనుమతి అవసరం లేదని వివరించాయి. పీఎం విమానానికి బ్లాంకెట్ పర్మిషన్ ఉంటుందని తెలిపాయి. వాస్తవానికి ఇది పెద్ద ప్రత్యేకమైన విషయం కానప్పటికీ.. గతంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో ఈ వ్యవహారం రెండు దేశాల్లోనూ తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన తర్వాత( 2019 ఫిబ్రవరి 26) భారతీయ విమానాల రాకపోకలపై పాకిస్తాన్ నిషేధం విధించింది. సెప్టెంబరు 2019లో పాక్ గుండా జర్మనీకి వెళ్లడానికి ప్రధాని మోదీకి అనుమతించలేదు. రెండేండ్ల తర్వాత యుఎస్‌‎కు వెళ్లడానికి పాక్ పర్మిషన్ ఇచ్చింది.