లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో మోదీ పాపులర్ స్ట్రైక్ రేట్ కాస్త తగ్గిందనే ఒక అభిప్రాయం ఉంది. అయినా ఇప్పటికీ మోదీయే బీజేపీకి తిరుగులేని నాయకుడనేది వేరే చర్చ. ‘మోదీయే బీజేపీ, బీజేపీయే మోదీ’ అనే నానుడి గత పదేండ్లుగా దేశ రాజకీయాలను శాసించిన మాట నిజం. మోదీ లేకుంటే బీజేపీ లేదు అనే పరిస్థితి కూడా మనకు కనిపించింది, వినిపించింది. ఒకనాడు ఇందిరయే ఇండియా, ఇండియాయే ఇందిర అనే నానుడి ఉండేది. మూడు దశాబ్దాల తర్వాత అలాంటి ప్రతిష్ఠ మోదీకే దక్కింది. కానీ, దాన్ని శాశ్వత నానుడిగా మలుచుకోవడంలో మోదీ విఫలమవుతున్నాడా అనే అనుమానాన్ని మాత్రం వర్తమాన రాజకీయ పరిస్థితులు కలిగిస్తున్నాయి.
2014 నుంచి 2019 వరకు మోదీ చరిష్మా బీజేపీకి తిరుగులేని విజయాలను తెచ్చిపెట్టింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 240 స్థానాలు సాధించడంలోనూ మోదీ ప్రజాదరణ ఉంది. ఆయన చరిష్మానే లేకుంటే, బీజేపీ 240 స్థానాలు కూడా దక్కేవి కావనేది కూడా నిజమే! మోదీ నాయకత్వం ఇప్పటికీ బీజేపీకి తురుపు ముక్కే అయినా.. గతంలోలాగ ఆయన చరిష్మా పనిచేయలేకపోతున్నదా అనే చర్చ మాత్రం ఉంది. లోక్ సభ ఎన్నికల తర్వాత నుంచి భారతీయ జనతాపార్టీ స్వశక్తినే ఎక్కువగా నమ్ముకుంటున్నట్లు కనిపిస్తున్నది. హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ పాపులారిటీ కన్నా, వ్యూహాత్మక రాజకీయాలతో, సోషల్ ఇంజినీరింగ్‌తోనే బీజేపీ గెలుపు సాధించిందనే అభిప్రాయం బలంగా ఉంది.
హర్యానాలో సోషల్ ఇంజినీరింగే గెలిపించింది
మోదీ బొమ్మలేకుండానే హర్యానాలో బీజేపీ ఎన్నికల ప్రచారం చేసింది. గెలుపు కోసం తెరవెనుక మోదీ సమయస్ఫూర్తి, వ్యూహ రచనలు ఉండొచ్చు. అది వేరే విషయం. కానీ, ప్రజలకు మోదీ బొమ్మ చూపకుండానే హర్యానాలో ఓట్లు అడగడం, గెలుపు సాధించడం చిన్న విషయమేమీ కాదు. హర్యానాలో జాట్లు బీజేపీకి దూరం కావడం వల్ల బీజేపీ ఓడిపోతుందని చాలా మంది భావించారు. అందుకు విరుద్ధంగా బీసీలు, ఎస్సీలు బీజేపీకి అండగా మారారనే విషయాన్ని ఎవరూ పసిగట్టలేకపోయారు. అక్కడ మోదీ ప్రజాదరణ కన్నా .. సోషల్ ఇంజినీరింగే బీజేపీని గెలిపించిందనేది ఫలితాల తర్వాతగానీ ఎవరికీ అర్థంకాలేదు.
భయాన్ని అధిగమించింది
బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని, రిజర్వేషన్లు రద్దు చేస్తుందని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం వల్ల యూపీ, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్రలలో జరిగిన నష్టం బీజేపీని వెంటాడుతూ వచ్చింది. కాబట్టే, హర్యానాలో మోదీ బొమ్మ లేకుండానే బీజేపీ ప్రచారం చేయాల్సివచ్చిందనేది కాదనలేం. అలాగే హర్యానా రైతుల విషయంలోనూ బీజేపీ భయపడింది. హర్యానాలో మోదీ బొమ్మనే కాదు, మోదీ ప్రచార సభలు కూడా ఎక్కువగా జరగకుండా బీజేపీ జాగ్రత్త పడింది. బీసీ ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీని ప్రకటించి గెలుపును సుసాధ్యం చేసుకుంది. జాట్లు దూరమైనా.. ఇతర ఓబీసీ, ఎస్సీ కులాలకు పెద్దపీట వేసి, మోదీ చరిష్మా లోటును బీజేపీ భర్తీ చేసుకోగలిగింది.
మహారాష్ట్రలో...
మహారాష్ట్రలో ఆరు ప్రధాన పార్టీలు మనుగడలో ఉండటం రాజకీయంగా అదొక భిన్నమైన రాష్ట్రమనే చెప్పాలి. లోక్‌సభ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన మహాయుతి కూటమి, అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని గెలుపును సాధించడం రాజకీయ పండితులకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్య మంత్రిగా ఏక్నాథ్ షిండే పట్ల సానుకూలత తప్ప వ్యతిరేకత పెరగలేదు. దానికి తోడు ఎన్నికలకు 4 నెలల ముందు ‘లాడ్ కీ బహెన్’ యోజన పథకం ప్రకటించి సుమారు రెండు కోట్ల మంది మహిళలకు ప్రతినెల రూ.1500 పంపిణీ చేయడం మహాయుతి గెలుపులో అత్యంత కీలకాంశంగా మారింది. అలాగే, మహా వికాస్ అఘాడీ కూడా తాము గెలిస్తే మహిళలకు రూ. 3000 ఇస్తామని ప్రకటించింది. రేపటి దానికి రూపం లేదన్నట్లు.. ఇప్పటికే నెలకు రూ. 1500 అందిస్తున్న మహాయతి కూటమినే మహిళలు నమ్మారు. మహారాష్ట్రలోనూ మోదీ ప్రజాదరణతో మహాయుతి కూటమికి పెద్దగా పనిలేకుండా పోయిందని చెప్పొచ్చు. సీఎం షిండే అనతికాలంలోనే ఫరవాలేదనిపించుకోవడం, అలాగే, ‘లాడ్ కీ బహెన్’ పథకం అమలు చేయడం ద్వారా మోదీ ప్రజాదరణ కొరతను బీజేపీ అధిగమించింది. ఏక్నాథ్ షిండే మరాఠా ఓబీసీ కావడం కూడా మహాయుతికి కలిసొచ్చింది.
స్ట్రైక్ రేట్ తగ్గడానికి కారణాలు
మోదీ ప్రజాదరణ స్ట్రైక్ రేట్ కాస్త తగ్గి ఉండొచ్చు తప్ప ఆయన ప్రజాదరణ పూర్తిగా పడిపోయిందని మాత్రం ఎవరూ చెప్పలేరు. అయితే, వ్యవసాయ బిల్లులను మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్నప్పటికీ.. ఆయన పాపులరిటీ స్ట్రైక్ రేట్‌ను మాత్రం ఎంతోకొంత అది ప్రభావితం చేసింది. అలాగే, రాహుల్ గాంధీ వినిపిస్తున్న కులగణన నినాదం సైతం మోదీ పాపులర్ స్ట్రైక్ రేట్‌ను తగ్గించడంలో భాగమైంది. అందుకే, ఇపుడు మోదీ పాపులారిటీపై మాత్రమే ఆధారపడకుండా.. సోషల్ ఇంజినీరింగ్‌పైనే బీజేపీ అత్యధికంగా దృష్టి పెడు తున్నది. దాంతో ఫలితాలను కూడా సాధించుకోగలుగుతోంది. మొత్తం మీద ఆమాత్రం తగ్గిన మోదీ పాపులర్ స్ట్రైక్ రేట్‌ను సోషల్ ఇంజినీరింగ్‌తో బీజేపీ భర్తీ చేసుకునే పనిలో నిమగ్నమైందని.. మహారాష్ట్ర, హర్యానా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఒడిశా ముఖ్యమంత్రుల నియామకంలో వచ్చిన సామాజిక మార్పే అందుకు సాక్ష్యం.
చివరగా..
ఎన్నికల్లో గెలుపులు తాయిలాల పథకాలపై ఆధారపడుతుండటం విచారకరమైన విషయం. ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు గెలుపులకు తాయిలాలనే నమ్ముకుంటున్నాయి. దేశ రాజకీయాల్లో ఈ జాడ్యం రోజు రోజుకూ పెరుగుతున్నది తప్ప తగ్గడం లేదు. ఉచిత విద్య, వైద్యం వంటి సంక్షేమ పథకాలు కాకుండా, తాయిలాల పథకాలను ఎర వేయడంతో నష్టపోతున్నది పేదలే. సరైన విద్య లేక, వైద్యం అందక ఈ దేశంలో తీవ్రంగా నష్టపోతున్నది పేదలే. ఇది దేశ ఆర్థిక వ్యవస్థకూ మంచి పరిణామం కాబోదు. ఈ విషయం అందరికన్నా ప్రధాని మోదీకే బాగా తెలుసు. అయినా ఆయన పాపులర్ స్ట్రైక్ రేట్ తగ్గుతున్నపుడు.. మోదీ సైతం తాయిలాలతోనైనా సరే తన పార్టీ గెలవాలనే కోరుకుంటాడు మరి!
బీజేపీ సోషల్ ఇంజినీరింగ్‌పై రాహుల్ ప్రభావం
రాహుల్ గాంధీ దేశంలో కులగణన జరగాలనే నినాదాన్ని ప్రచారంలో పెట్టినప్పటి నుంచి, బీజేపీ సోషల్ ఇంజినీరింగ్‌పై మరింత ఫోకస్ పెట్టిందని చెప్పాలి. మధ్యప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ (ఓబీసీ)ను చేయడం, హర్యానాలోనైతే ఎన్నికలకు ముందే ఓబీసీకి చెందిన నయాబ్‌సింగ్ సైనీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి, ఆయననే ముఖ్యమంత్రిని చేయడం తెలిసిందే. అలాగే, దేశవ్యాప్తంగా కూడా ఓబీసీలను బీజేపీ తన ఓటు బ్యాంకుగా మార్చుకోవడంపైనే ఎక్కువగా దృష్టి పెడుతుండటం గమనించొచ్చు. అలాగే, చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో(ఎస్టీ) ముఖ్యమంత్రులను నియమించడం.. బీజేపీ సోషల్ ఇంజినీరింగ్‌లో వేగంగా వచ్చిన మార్పునకు నిదర్శనంగా చెప్పొచ్చు. మోదీ స్ట్రైక్ రేట్ తగ్గుతున్నాదా అనే ప్రశ్న వల్ల.. బీజేపీ సోషల్ ఇంజినీరింగ్‌తో ఓటు బ్యాంకులను స్థిరపరుచుకునే పనిలో పడింది. రాహుల్ గాంధీ కుల గణన ఎజెండా, బీజేపీలోనూ మరింత మార్పునకు కారణం కావడం, దేశంలో సోషల్ జస్టిస్‌కు సంబంధించి ఒక మంచి పరిణామమే అనే అభిప్రాయమూ వినిపిస్తున్నది. ఒకప్పుడు ‘బ్రాహ్మణ్, బనియా’ పార్టీ అని పిలవబడ్డ బీజేపీ.. అందుకు భిన్నంగా ఇపుడు సామాజిక పార్టీగా మార్పు చెందుతున్నదని మాత్రం చెప్పొచ్చు.
2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత నుంచి బీజేపీ తన వ్యూహాత్మక రాజకీయాలకు బాగా పదును పెడుతూ వస్తున్నది. ఒకప్పుడు, బీజేపీని ‘బ్రాహ్మణ్, బనియా’ పార్టీ అనే వారు. ఆ పరిస్థితిని మెల్లి మెల్లిగా బీజేపీ మార్చుకుంటూ వస్తున్నది. ఈ పరివర్తన మోదీ పాలనా హయాం నుంచే మొదలైనా.. ఆ అవసరం ఈ మధ్య ఆ పార్టీకి మరింత ఎక్కువ అవసరంగా మారుతూ వస్తున్నది.
కల్లూరి శ్రీనివాస్‌రెడ్డి
పొలిటికల్ ఎనలిస్ట్