రైతుల విషయంలో మోడీ హుందాతనం

రైతుల విషయంలో మోడీ హుందాతనం

రైతులు పండించిన పంటను మార్కెట్​లో అమ్ముకోవడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని తొలగించి సరైన మార్కెట్​లో రైతులు పంటలను అమ్ముకోవడానికి కేంద్రం కొన్ని సంస్కరణలను ఇప్పటికే తీసుకొచ్చింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులందరికీ రైతు బీమా యోజన పథకం తెచ్చింది. అలాగే పెట్టుబడి సాయం కింద ప్రతి రైతుకు రెండు వేల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నది. ఏడాదికి ఒక రైతుకు ఆరు వేల రూపాయల చొప్పున కేంద్ర ప్రభుత్వం కిసాన్​ సమ్మాన్​ యోజన పథకం కింద చెల్లిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధుకు అదనంగా ప్రతి రైతు బ్యాంక్​ ఖాతాలో కిసాన్​ స్కీమ్​ నిధులు కూడా జమ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. దేశవ్యాప్తంగా 27 రకాల పంటలకు మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు మాత్రమే మద్దతు ధర ప్రకటించింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక ద్వారా రైతులకు మద్దతు ధర ప్రకటించాల్సిన అవసరం ఉంది.


పంజాబ్​ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ కాన్వాయ్​ను రైతులు అడ్డుకోవడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రధాని భద్రత విషయంలో విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అయితే ఇక్కడ అందరూ గుర్తించాల్సిన విషయం ఒకటుంది. 20 నిమిషాల సేపు ఫ్లైఓవర్​పైనే ఉండిపోవాల్సి వచ్చినా.. ప్రధాని మోడీ రైతుల విషయంలో చాలా హుందాగా ప్రవర్తించారు. వారి ఆందోళనకు గౌరవం ఇచ్చారు. ఎవరినీ ఒక్క మాట కూడా అనకుండా తన కార్యక్రమాన్ని రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీ వెళ్లిపోయారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రైతుల ఆందోళనను గౌరవించి వెనుదిరగడం ఇప్పటివరకు మన దేశ చరిత్రలో జరిగింది లేదు.

సాధారణంగా ఒక మంత్రి గానీ, ఎమ్మెల్యే గానీ రోడ్డు మీద పోతుంటే స్టూడెంట్లు, రైతులు, ప్రజలు ఆందోళనలు చేస్తే పోలీసులు లాఠీఛార్జి చేసి వీరంగం సృష్టించి రోడ్డు క్లియర్ చేస్తారు. కానీ, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ప్రధానమంత్రి నడిరోడ్డుపై అరగంట సేపు ఆగిపోయినప్పటికీ అక్కడ పోలీస్​ ఫోర్స్​నుగానీ, అదనపు బలగాలను గానీ రంగంలోకి దింపలేదు. జనాలపై లాఠీలు విరగలేదు. ఒక్క వ్యక్తి పై కూడా చెయ్యి చేసుకుని పక్కకు తొలగించలేదు. పోలీసులు ప్రజలను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు. దీన్ని బట్టి చూస్తే ప్రధానమంత్రి రైతులకు గౌరవం ఇచ్చినట్టు అర్థమవుతోంది. ధర్నా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించలేదని కూడా తెలుస్తోంది. పైగా తన పర్యటనే విరమించుకుని తిరిగి ఢిల్లీకి బయలుదేరారు. దీని ద్వారా తాను ప్రజల నాయకుడిని అని మరోసారి మోడీ నిరూపించుకున్నారు.
 

ప్రజల పట్ల గౌరవంతోనే..

ప్రధానమంత్రి ప్రయాణం చేస్తున్నాడంటే ఒక ప్రాంతంలో ఎంత బందోబస్తు ఉంటుందో మనందరికీ తెలుసు. స్థానిక పోలీసులు, కేంద్ర బలగాలు, జెడ్ కేటగిరీ సెక్యూరిటీ, ఎన్ఎస్జీ కమాండో భద్రత, సంబంధించిన ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రధాని ప్రయాణం చేసే దారి వెంబడి నిఘా వేస్తారు. ఎంతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తారు. అయితే ప్రధానమంత్రి ప్రయాణం చేస్తున్న దారిలో ధర్నా చేసే విషయాన్ని గమనించి పోలీసులు కేంద్ర బలగాలు, భద్రతా వ్యవస్థను అలెర్ట్​ చేయాలి. కానీ పంజాబ్​లో అలాంటి చర్యలేవీ చేపట్టకపోవడం మనం గమనించాలి. కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఏడాది కాలం పాటు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో రైతులు వేలాదిగా చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు మనకు తెలిసిందే. రైతుల విన్నపాలను విన్న ప్రధాని కేంద్రం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు నవంబర్​లో ప్రకటించారు. స్వయంగా రైతులకు క్షమాపణ చెబుతున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ప్రధాని మోడీ దేశ ప్రజల పట్ల, రైతుల పట్ల ఎంతటి గౌరవాన్ని కనబరిచారో దీనిని బట్టి మనకు అర్థమవుతుంది.
 

రాయితీలు, సబ్సిడీలు మరింత పెంచాలె

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుకు ఇస్తున్న సబ్సిడీలను, రాయితీలను ఇంకా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోంది. ఆవులు ఆవులు కొట్లాడుకుని లేగదూడల కాళ్లు విరగ్గొట్టినట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోట్లాడుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఉమ్మడి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలి. అలాగే చట్టాలు చేసే ప్రభుత్వాలు రైతుల పట్ల గౌరవ భావంతో  మెలగాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రధాని మోడీ పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో వ్యవహరించిన తీరును అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. ధర్నా చేస్తున్న రైతుల పట్ల ప్రధానమంత్రి వ్యవహారశైలిని మానవీయ కోణంలో అర్థం చేసుకోవాలి. చిన్నాచితకా నాయకులు దారి వెంబడి పోతుంటేనే ధర్నాలు, ఆందోళన చేసే వాళ్లను చావగొడుతున్నారు. ఈ సమయంలో హడావుడి చేసే అధికార యంత్రాంగం గురించి మనం ఎన్నోసార్లు చూసి ఉంటాం. కానీ, ఒక ప్రధానమంత్రి వెళ్తున్న సమయంలో రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల పట్ల గౌరవంగా వ్యవహరించి, ధర్నా చేస్తున్న వారిపై ఎలాంటి బలప్రయోగం చేయకుండా తనంతట తానుగా వెనుదిరిగి వెళ్లిపోయారు ప్రధాని మోడీ. దీన్ని బట్టి మానవ హక్కులకు మోడీ సర్కారు ఎంత విలువ ఇస్తోందో, ప్రజలను ఎంత మేరకు పాలకులు గౌరవిస్తున్నారన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. మిగతా నాయకులు కూడా మోడీ మాదిరిగా వ్యవహరించాలి. ప్రజలు, విద్యార్థులు, రైతులు ఆందోళనలు, ధర్నాలు చేసిన సమయంలో వారిని గౌరవించాల్సిన అవసరం నేటి పాలకులపై ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు, ఆందోళనలను రాష్ట్ర ప్రభుత్వం నియంతృత్వంతో అణచివేస్తోంది. నిరంకుశంగా కాకుండా ప్రజలకు చేరువయ్యేలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఇకనైనా రాష్ట్ర పాలకులు గుర్తించాలి.