సాగుకు మోడీ సబ్సిడీలు.. కేసీఆర్​ ఎగనామాలు! : నరహరి వేణుగోపాల్​ రెడ్డి

టీఆర్ఎస్​ను బీఆర్ఎస్ గా ప్రకటించుకున్నప్పటి నుంచి మొన్నటి ఖమ్మం సభ దాకా దేశంలో వ్యవసాయం, సాగునీరు, విద్యుత్​ గురించి బాగా మాట్లాడుతున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో వాటి పరిస్థితి ఎలా ఉందో పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. వ్యవసాయ రంగం రాష్ట్ర పరిధిలోని అంశం. కేంద్రం కొన్ని వ్యవసాయ అంశాలపై రాష్ట్రాలకు సహకారం అందిస్తుంది. ప్రధానంగా ఎగుమతి, దిగుమతుల విధానాలు, కనీస మద్దతు ధర, రైతులకు పంట రుణాలు, పరిశోధన, పెట్టుబడులు, కొన్ని ప్రత్యేక చట్టాలు, ప్రకృతి విపత్తులు, ధాన్యం సేకరణ, ఫసల్​బీమా తదితర అంశాలపై రాష్ట్రాలకు సహకారం అందిస్తుంది. మన రాష్ట్రంలో వ్యవసాయానికి ఒక సమగ్ర ప్రణాళిక లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోలేకపోతున్నది. అందుకు గల కారణం రాజకీయ అహంకారం. దీని వల్ల తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నది. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయాన్ని ప్రధానంగా ఐదు భాగాలుగా విభజించి పాలన చేస్తున్నది. మొదటిది, రైతులకు పంట ఉత్పత్తుల ఖర్చు తగ్గించడం. రెండోది, రైతు పంటలకు సరైన ధరలు వచ్చేలాగా మార్కెట్​ను రెగ్యులేట్​చేయడం. మూడోది,  విపత్తుల ద్వారా పంట నష్టపోతే ఆదుకునే ప్రణాళిక. నాలుగోది, వ్యవసాయానికి మౌలిక సదుపాయాల కల్పన. ఐదోది, వ్యవసాయ భూముల రెగ్యులేషన్. ఇవి కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ ప్రణాళికలో ప్రధాన భాగాలు.

పంట రుణాలు

కేంద్రం నాబార్డు ద్వారా సుమారు రూ.17 లక్షల కోట్లు రైతుకు ఏడాదికి 7 శాతం వడ్డీ చొప్పున పంట రుణాలు ఇస్తున్నది. అందులో మూడు శాతం వడ్డీ కేంద్ర ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. మిగాతా 4 శాతం రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేస్తున్నది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష రుణమాఫీ చేయకపోవడం వల్ల మొత్తం రైతుల రుణాలు పేరుకుపోయి, ఆ రుణాలు ఎంపీఏలుగా మారి11శాతం వడ్డీతో దానికి చక్రవడ్డీ కలిపి ఐదేండ్లలో వడ్డీనే రూ.లక్ష చేరింది. ఒకవేళ ఎన్నికల ముందు రూ.లక్ష రుణమాఫీ చేసినా, మళ్లీ రూ. లక్ష రుణం మిగిలే ఉంటుంది. నాలుగేండ్లలో రుణ మాఫీ జరగకపోవడంతో బ్యాంకుల నుంచి కొత్త రుణాలు దొరకడం లేదు. తద్వారా రైతులు రూ.3 వడ్డీకి ప్రైవేటు అప్పులు తెచ్చుకొని చతికల పడుతున్నారు. దాంతో ఆత్మహత్యలు పెరిగాయి. ఏటా రాష్ట్రంలో రెండు పంటలకు రైతులు రూ.70 వేల కోట్ల రుణాలు తీసుకుంటారు. రుణమాఫీ చేయకపోవడం వల్ల , రైతులకు లోన్లు రాక, 4 శాతం వడ్డీ తగ్గింపు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అవుతున్నది. కేంద్రం భూసార పరీక్షలకు నిధులు ఇస్తున్నది. భూమిలో ఏయే పోషకాలు ఉన్నాయో, ఏవి  లేవో తెలుసుకొని అవసరమున్న పోషకాల ఎరువులు వేసేందుకు కేంద్రం రాష్ట్రానికి సహకరిస్తున్నది. కానీ భూసార పరీక్షలకు నిర్వహించేందుకు రాష్ట్రం వద్ద తగిన యంత్రాంగం లేదు. అమలు చేసే చిత్తశుద్ధి లేదు. రైతులకు పెట్టుబడి తగ్గించాలనే ఆలోచనే లేదు. దాంతో  రైతుల పెట్టుబడి పెరిగి, నష్టపోతున్నారు. ఆత్మహత్యల పాలవుతున్నారు. మన రాష్ట్రంలో ఖరీఫ్​లో అన్ని పంటల  సాగు విస్తీర్ణం ఒక కోటి 25 లక్షల ఎకరాలు. అందులో పత్తి సుమారు 50 లక్షల ఎకరాలు, వరి 60 లక్షల ఎకరాలు. ఈ రెండు కలిపి సుమారు కోటి పది లక్షల ఎకరాల్లో సాగు అవుతున్నాయి. ఈ రెండు పంటలకు కేంద్రం ఎకరాకు రూ. 40 నుంచి రూ.50 వేల పైన పంట రుణం అందిస్తున్నది. మోడీ ప్రభుత్వం వచ్చాక పంట రుణాల పరిమితి పెంచింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం అందిస్తున్న రుణ సౌకర్యాలను 
అందుకోలేని స్థితికి దిగజారింది.

ఒక ఎకరం వరి సాగుకు కనీసం 3 బస్తాల యూరియా, ఒక బస్తా డీఏపీ, 2 సూపర్​పాస్ఫేట్​ బస్తాలు, ఒక పొటాష్​ బస్తా వేస్తే, పక్కన పేర్కొన్న ఎరువుల ధరల ప్రకారం ఎకరాకు రూ.11,509  కేంద్రం ఎరువులకు సబ్సిడీ ఇస్తున్నది. పత్తికి అయితే ఎకరాకు కనీసం 4 బస్తాల యూరియా, 2 బస్తాల 20–20, ఒక బస్తా డీఏపీ, ఒక బస్తా పొటాష్​ వేస్తే, ఒక ఎకరా పత్తి పంట ఎరువులకు కేంద్రం ఇస్తున్న సబ్సిడీ రూ.16,435. ఇలా ప్రతి పంటకు వేసే ఎరువులపై కేంద్రం సబ్సిడీలు ఇస్తున్నది.  ఇదీగాక సన్న, చిన్నకారు రైతులకు ఏటా పెట్టుబడి సాయం కింద రూ.6 వేలు ఇస్తున్నది. తెలంగాణ సర్కారు ఎకరాకు ఏడాదికి రూ.10 వేలు ఇస్తూ మిగతా సబ్సిడీలు ఎత్తేసి, రైతులను దగా చేస్తున్నది. 

ఎరువులపై కేంద్రం ఇస్తున్న సబ్సిడీలు (రూ.లలో)

ఎరువుల పేర్లు                కంపెనీ ధర    కేంద్రం సబ్సిడీ    రైతు కొంటున్న ధర
యూరియా                          2,715.19            2,448.69                    266.50
డీఏపీ                                   3,850.65            2,500.65                   1,350
20‑20‑0    3,042.10    1,692.10    1,350
సూపర్​ పాస్ఫేట్                 890.65                375.65                      515
పొటాష్                                2,459.30            759.30                      1,700
28‑28‑0    3,894    2,309    1,585 

లక్షల కోట్ల సబ్సిడీ ఇస్తూ..

కేసీఆర్ ​భాషలో వ్యవసాయంలో కౌలు రైతులకు స్థానం లేదు. వ్యవసాయ పెట్టుబడిలో కేంద్రం ఇస్తున్నది బారెడు, రాష్ట్రం ఇస్తున్నది మూరెడు కూడా లేదు. ఈ విషయాన్ని పొలం దున్ను తున్న ప్రతి రైతూ అర్థం చేసుకోవాలి. 24 గంటల ఉచిత కరెంటు చాటింపు వేసుకోవడంలో కేసీఆర్​ ఆరితేరారు. కానీ గత రెండేళ్లుగా రైతుకు కరెంటు ఎనిమిది గంటలకు మించి ఇస్తున్నది లేదు. ఏటా విద్యుత్​ చార్జీలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపుతున్నారు. కుడి చేత్తో ఇచ్చి, ఎడమ చేత్తో లాక్కుంటున్నారు. కరోనా తర్వాత అన్ని ఎరువుల ధరలు పెరిగాయి. కానీ మోడీ ప్రభుత్వం రైతుల ఎరువులను మాత్రం పెరగనివ్వలేదు. కేంద్రం దేశవ్యాప్తంగా రైతులకు రూ. ఒక లక్షా అరవై ఐదు వేల కోట్ల ఎరువుల సబ్సిడీ ఇస్తున్నది. రైతులకు పెట్టుబడి, భూసార పరీక్షలకు నిధులు, రుణాల మీద 3 శాతం వడ్డీ రిబేటు, పనిముట్లకు రిబేటు, భారీగా ఎరువుల సబ్సిడీలు ఇస్తూ  కేంద్రంలో మోడీ సర్కారు ముందుకు పోతున్నది. కాబట్టే దేశంలో పంటల ఉత్పత్తి పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎగుమతు లు చేసే స్థాయికి దేశం ఎదిగింది. ఇవాళ ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతున్న పక్క దేశాలకు ఆపన్న హస్తం అందిస్తూ ఆహార ధాన్యాలను ఇవ్వగలుగుతున్నది. దేశంలో మోడీ ప్రభుత్వం చర్యలు రైతులకు సంపూర్ణంగా ఉపయోగప డుతున్నాయి. కానీ  కేంద్రం ఇస్తున్న అనేక వ్యవసాయ సబ్సిడీలకు, కేసీఆర్​సర్కారు ఎగనామం పెట్టి రైతులకు సమస్యలను పెంచింది. 

- నరహరి వేణుగోపాల్​ రెడ్డి, బీజేపీ సీనియర్​ నేత