మోడర్న్​ దేశం… పురానా సిస్టం

రోబోలు, టయోటా, నిస్సాన్ లాంటి కార్లు, హోండా, సుజికి లాంటి బైక్ లు, బుల్లెట్ ట్రయిన్లు….వీటన్నింటికీ అడ్రస్ జపాన్. అలాంటి మోడర్న్ జపాన్, చక్రవర్తి  పాలనలో ఉండటమేంటి ? పట్టాభిషేకమేంటి ? దానికి ప్రపంచ లీడర్లందరినీ గెస్టులుగా  పిలవడమేంటి ?

ఆసియాలో నేటికీ నిలిచిన రాజరికాలు కొన్నే ఉన్నాయి. వాటిల్లో అతి పురాతన సంప్రదాయాన్ని పాటించేవి జపాన్​, థాయ్​లాండ్, కంబోడియాలు. క్రీస్తు పూర్వం 600 నుంచి రాచరికాన్ని ఎంతో గౌరవంగా పాటిస్తున్న దేశం జపాన్​. ఈ ఏడాది మే నెల వరకు చక్రవర్తిగా కొనసాగిన అకిహితో తనంతట తానుగా సింహాసనాన్ని పెద్ద కొడుకు నరుహితోకి అప్పగించేశారు. దానికి సంబంధించిన అన్ని లాంఛనాలు ఇప్పుడు నిర్వహించి పట్టాభిషేకం జరిపారు. ఇకపైన  చక్రవర్తిగా నరుహితో, మహారాణిగా ఆయన భార్య మసాకో ఒవాడా జపాన్​ దేశాన్ని పాలిస్తారు. ఈ పట్టాభిషేక కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ సహా ప్రపంచం నలుమూలల నుంచి 190 దేశాలకు చెందిన 420 మంది అతిథులు హాజరయ్యారు. మొత్తం 2,000 మంది సమక్షంలో నరుహితో 126వ చక్రవర్తిగా బాధ్యతలు స్వీకరించారు.

దాదాపుగా 30 నిమిషాలపాటు సాగిన పట్టాభిషేక మహోత్సవాన్ని ఇంపీరియల్​ ప్యాలెస్​లో నిర్వహించారు. నరుహితో తన ప్రమాణం పూర్తి చేయగానే వేదిక ముందు నిలబడ్డ జపాన్​ ప్రధాన మంత్రి షింజో అబే అభినందనలు తెలిపారు. ‘జపాన్​ దేశపు ఉజ్వల భవిష్యత్తుకు, శాంతి స్థాపనకు మనం చిత్తశుద్దిగా ప్రయత్నిద్దాం. జపాన్​ సంస్కృతిని అభివృద్ధి పరచడంలో మనమంతా కలిసికట్టుగా పనిచేద్దాం. మానవాళి సంక్షేమాభివృద్ధి కోసం, అంతర్జాతీయ శాంతి సుస్థిరతలకోసం, స్నేహసహకారాలకోసం, మరింతగా డెవలప్​మెంట్​ సాధనకోసం ప్రజల శక్తిసామర్థ్యాలతో మన దేశం కృషి చేస్తుంద’ని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య యుగంలో.. ఒక దేశంలో రాచరిక మార్పిడి అనేది అంతగా చెప్పుకోదగ్గ విశేషమేమీ కాదు. జపాన్​లో జరిగిన పట్టాభిషేకానికి మాత్రం ప్రత్యేకతలున్నాయి. ఇక్కడి రాచరిక వ్యవస్థ మన దేశంలో గుప్తుల కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. బుద్ధ భగవానుడి బోధనలతో జపాన్​ ప్రభావితమైంది. చైనా, కొరియాల మీదుగా బౌద్ధం ఈ దేశంలో ప్రవేశించింది. ఈ రోజున జపాన్​లోని 12 కోట్ల జనాభాలో 9 కోట్ల మంది అనుసరించే ఆధ్యాత్మిక తత్త్వం బుద్ధిజం. ఈ మతం ప్రవేశించే సమయానికి జపాన్​లో షింటో సిద్ధాంతం ఉండేది. ఆరంభంలో రెండింటిమధ్య ఘర్షణ ఏర్పడినా, బుద్ధిజంలోని మానవీయతను అంగీకరించడంతో వీటి నడుమ సఖ్యత ఏర్పడింది. ఇప్పుడు షింటో సంప్రదాయం బుద్ధిజంలో భాగంగా మారిపోయింది.  ప్రస్తుత చక్రవర్తి నరుహితో కుటుంబం అవలంబించేదికూడా షింటో సంప్రదాయాన్నే.

ముందుగా అనుకున్న షెడ్యూల్​ ప్రకారం… నరుహితో పట్టాభిషేకం ఓపెన్​ గ్రౌండ్​లో జరగాలి. కత్తులు, విల్లంబులతో 70 మందికి పైగా సైనికులు చక్రవర్తి నరుహితో రాకను స్వాగతించాలి. అయితే, ఉదయాన్నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో హాలులోనికి మార్చారు. ప్రమాణం పూర్తికాగానే అంగరక్షక దళం 21 గన్​ శాల్యూట్​ని సమర్పించింది. సాయంత్రం అతిథులకు రాచరికపు విందు ఇచ్చారు.  నరుహితో తన పట్టాభిషేకం నాడు జాతీయ సెలవు దినం ప్రకటించారు. చిన్నా చితక నేరాలతో జైలు పాలైన అయిదు లక్షల 50 వేల మందికి క్షమాభిక్షనిచ్చారు.  ఈ ఉత్సవం ముగియగానే జపాన్​ రాజధాని టోక్యోలో చక్రవర్తి దంపతులు ప్రజలను సందర్శించాల్సి ఉన్నప్పటికీ… ఇటీవల పెను తుఫాన్​ వచ్చినందువల్ల రద్దు చేశారు. వచ్చే నెల 10వ తేదీన ప్రజా సందర్శనం ఉంటుందని ప్రకటించారు.

వారసుడిగా 13 ఏళ్ల ప్రిన్స్​

ప్రస్తుత చక్రవర్తి నరుహితోకి ఒకరే కూతురు. అక్కడి సంప్రదాయం ప్రకారం మగ పిల్లాడికి మాత్రమే సింహాసనం అర్హత లభిస్తుంది. నరుహితో, మసాకో ఒవాడాలు ఆక్స్​ఫర్డ్​లో చదువుకుంటున్నప్పుడే ప్రేమించుకుని 1993లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఏకైక సంతానమైన యువరాణి ఐకో 2001లో పుట్టింది. మగ సంతానం లేకపోవడంవల్ల చక్రవర్తి వారసత్వం నరుహితో తమ్ముడు (అకిహితో చిన్న కొడుకు) ఫ్యూమిహితో (53)కి దక్కింది.  ఫ్యూమిహితోని ప్రిన్స్​ అకిషినోగా పిలుస్తారు. ఫ్యూమిహితో, కైకో కవాషిమా దంపతులకు ఇద్దరు కూతుళ్లు (మాకో, కాకో), ఒక్కడే కొడుకు హిసాహితో. 13 ఏళ్లవాడైన ప్రిన్స్​ హిసాహితోకి సింహాసన అర్హత లభించనుంది.

 

ఈ సింహాసనాలు చాలా స్పెషల్​

పట్టాభిషేక సమయంలో చక్రవర్తి నరుహితో ఒక మంటపంలోనూ, మహారాణి మసాకో మరో మంటపంలోనూ నిలబడ్డారు. నిజానికవి మంటపాలు కావు. నర రాచరికం మొదలైన 8వ శతాబ్దం నుంచి నూతన చక్రవర్తి పట్టాభిషేకాన్ని నిర్వహిస్తున్న ప్రత్యేక సింహాసనాలు. చక్రవర్తి నిలబడిన సింహాసనాన్ని ‘తకమికుర’గా, మహారాణి నిలబడిన సింహాసనాన్ని ‘మిషోదాయి’గా వ్యవహరిస్తారు. అంతకుముందు రాణులు ఈ కార్యక్రమానికి వచ్చేవారు కాదు. 1913 నుంచి థాయ్​షో హయాం నుంచి ఈ ఘోషా సంప్రదాయాన్ని తొలగించారు. థాయ్​షో, షోవా (హిరోహితో), అకిహితోల పట్టాభిషేకాలకు రాణులుకూడా వచ్చారు. తకమికుర ఆరున్నర మీటర్ల ఎత్తున ఆరు మీటర వైశాల్యంతో ఉంటుంది. దీనిపైన ఫీనిక్స్​ బంగారు ప్రతిమను, అష్ట దిక్కుల్లోనూ చిన్న విగ్రహాలు ఉన్నాయి. వీటి మధ్యలో 28 అద్దాలను అమర్చారు. సింహాసనంలో రాజఖడ్గం, పవిత్ర హారం, రాజముద్ర, దేశ చిహ్నాలకోసం ప్రత్యేక అరలున్నాయి.  మహారాణి మసాకో నిలుచున్న ‘మిషోదాయి’కూడా దాదాపుగా ఇలాగే ఉన్నా, సైజులో ఒక మీటరు చిన్నగా ఉంది. ఈ రెండిటి లోపల తెరలు కట్టిన సింహాసనాలున్నాయి.

చక్రవర్తి కోసం 5 కోట్ల కారు

జపాన్​ కొత్త చక్రవర్తి నరుహితో కోసం ప్రత్యేకంగా టయోటా కారు రెడీ చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్​కోసం 5 కంపెనీలు పోటీ పడ్డాయి. వాటిలో టయోటా కంపెనీ… భద్రత, పర్యావరణం, ఇంటీరియర్​, రాజ దంపతుల ఒడ్డూ పొడుగు వంటివి దృష్టిలో ఉంచుకుని స్పెషల్​గా డిజైన్​ చేసింది. సెడాన్​ స్టయిల్​లో ఉండే ఈ కారులో అవసరాన్ని బట్టి టాప్​ను మూసివేసుకోవచ్చు. ఇన్ని ఫీచర్లున్న కారు విలువ జపాన్​ కరెన్సీలో 8 కోట్ల యెన్​లు (రూపాయల్లో దాదాపుగా 5 కోట్ల 22 లక్షలు!).

సింహాసనాన్ని తనకు తానుగా వదిలేసిన అకిహితో

జపాన్​ చరిత్రలో తండ్రి లేదా చక్రవర్తి బతికుండగానే అతని వారసుడు పట్టాభిషేకం జరుపుకోవడం ఇదే మొదటిసారి. జపాన్​ 125వ చక్రవర్తి అకిహితో (85) సింహాసనాన్ని వాలంటరీగా వదులకున్నారు. చక్రవర్తి హోదాలో ఉన్నా  సింహాసనాన్ని పరిత్యజించడానికి అవసరమైన న్యాయపరమైన అనుమతి తీసుకున్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 1947లో రాజ్యాంగం అమలులోకి వచ్చాక  చక్రవర్తి అధికారాలు నామమాత్రమయ్యాయి. విదేశాల నుంచి ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు వస్తే మర్యాదపూర్వకంగా కలుసుకోవడడం, ప్రజా సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరు కావడానికి పరిమితమయ్యారు.

రాచరిక చిహ్నాల ప్రత్యేకతలు

కొత్త చక్రవర్తి నరుహి వద్ద జపాన్ రాజరికపు చిహ్నాలైన ఖడ్గం, రత్నం, అద్దం ఉంటాయి. వీటిని ఈ ఏడాది మే నెలలో చక్రవర్తిగా ప్రకటించగానే అందజేశారు. వీటిలో ఖడ్గాన్ని పరాక్రమానికి, రత్నాన్ని ధర్మ గుణానికి, అద్దాన్ని తెలివితేటలకు ప్రతీకగా భావిస్తారు. జపాన్​లో ఈ మూడు వస్తువులు రాజవంశపు వారసత్వ సంపదగా, రాజచిహ్నాలుగా ఉంటాయి. ఎన్నో తరాలుగా ఇవి వారసత్వంగా వస్తున్నాయి. ఈ రాజచిహ్నాలను చాలా పవిత్రంగా భావిస్తారు చక్రవర్తులు. ‘ఇసే గ్రాండ్’ అనే పవిత్ర ప్రదేశంలో వీటిని భద్రపరుస్తారు.