
హైదరాబాద్, వెలుగు: బస్సులో గుండెపోటుతో మరణించిన ప్రయాణికుడి మృతదేహాన్ని డ్రైవర్, కండక్టర్ అదే బస్సులో ఇంటికి చేర్చి మానవతా దృక్ఫథాన్ని చాటుకున్నారు. ఈ నెల 14న మహబూబాబాద్ డిపోకు చెందిన బస్సు ఖమ్మం నుంచి మహబూబాబాద్ వెళుతున్నది. కురవి మండలం మోదుగులగుడెంకు చెందిన హుస్సేన్ అనే వ్యక్తి బస్సులో గుండెపోటుకు గురయ్యాడు. 108కి సమాచారం ఇవ్వగా అప్పటికే ఆయన చనిపోయాడు.
దీంతో కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ డి.కొము రయ్య ఉన్నతాధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. అధికారుల ఆదేశాలతో బస్సులోనే 30 కిలోమీటర్లు మృతదేహాన్ని జాగ్రత్తగా ఇంటికి చేర్చారు. కాగా, శనివారం బస్‌భవన్‌లో కండక్టర్ కె.నాగయ్య, డ్రైవర్ డి.కొమురయ్య, డిపో మేనేజర్ విజయ్ ను ఎండీ సజ్జనార్ అభినందించి సన్మానించారు.