Moeen Ali: వన్డే క్రికెట్ చచ్చిపోయింది.. అదో చెత్త ఫార్మాట్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్

Moeen Ali: వన్డే క్రికెట్ చచ్చిపోయింది.. అదో చెత్త ఫార్మాట్: ఇంగ్లాండ్ ఆల్ రౌండర్

ఉరుకుల పరుగుల జీవితాల్లో దేన్నైనా షర్ట్ కట్ గా ఆలోచిస్తున్న ఈ రోజుల్లో గంటల తరబడి క్రికెట్ మ్యాచ్ లు చూసే రోజులు పోయాయి. ఈ క్రమంలోనే టీ20 లీగ్స్ కు క్రేజ్ పెరుగుతుండగా.. కొన్ని దేశాల్లో టీ10 లీగ్స్ కూడా ఆడిస్తున్నారు. ధనాధన్ షాట్స్, చివరి బాల్ వరకు కిక్కే కిక్కు.. క్షణాల్లోనే మారిపోతున్న మ్యాచ్ స్వరూపం. నిమిషాల్లోనే విక్టరీ ఫలితం. దీన్నే కోరుకుంటున్నారు అభిమానులు కూడా. ఐపీఎల్ తర్వాత పలు దేశాల్లో లీగ్స్ వచ్చేశాయి. దీంతో ఇప్పుడు వన్డేలు చూసే ఓపిక ఎవరికీ ఉండట్లేదు. ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీ వన్డే ఫార్మాట్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

మొయిన్ అలీ మాట్లాడుతూ.. ."టీ20 లీగ్‌లను ఇష్టపడేవారు సంఖ్య పెరగడంతో 50 ఓవర్ల ఫార్మాట్ ఎవరూ ఆదరించడం లేదు. బ్యాటర్లకు అనుకూలంగా ఉండే భయంకరమైన రూల్స్ 50 ఓవర్ల ఫార్మాట్‌ను చనిపోయేలా చేశాయి. ప్రపంచ కప్‌, ఛాంపియన్స్ ట్రోఫీ మినహా ఈ ఫార్మాట్ దాదాపు పూర్తిగా కనుమరుగైంది. ఇది ఆడటానికి చెత్త ఫార్మాట్. దానికి చాలా కారణాలు ఉన్నాయని నేను భావిస్తున్నాను. మొదటి పవర్ ప్లే తర్వాత సర్కిల్ వెలుపల ఐదుగురు ఫీల్డర్లు ఉండేవారు. కానీ గత కొన్ని సంవత్సరాలలో, అది నలుగురికి మారింది. 

ALSO READ | Virat Kohli: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. విండీస్ విధ్వంసకర ఓపెనర్ రికార్డ్‌పై కోహ్లీ గురి

మిడిల్ ఓవర్లలో బౌలర్లకు ఇది కష్టంగా మారింది. అదే సమయంలో బ్యాటింగ్‌ర్లు పరుగులు పిండుకుంటున్నారు. అంతేకాకుండా రెండు కొత్త బంతులను ఉపయోగిస్తున్నారు. ఇది స్ట్రోక్-మేకింగ్‌ను చాలా సులభతరం చేస్తుంది. వన్డేల్లో నిబంధనలు భయంకరంగా ఉన్నాయని నేను భావిస్తున్నాను. అందుకే ఇప్పుడు వన్డే క్రికెట్‌లో బ్యాటర్లు సగటున 60, 70 పరుగులు చేస్తున్నారు. ఎవరికైనా బౌలింగ్ వేస్తూ కొంచెం ఒత్తిడి పెంచితే అతను రివర్స్-స్వీప్ చేస్తాడు. అది ఫోర్ వెళ్తుంది. బ్యాటర్లకు స్కోర్ చేయడానికి ఎల్లప్పుడూ ఏదో ఒక ఆప్షన్ అందుబాటులో ఉంటుంది". అని మోయిన్ టాక్స్‌పోర్ట్ క్రికెట్‌తో అన్నారు.

మొయిన్ అలీ వన్డేల్లో ఇంగ్లాండ్  తరఫున బెస్ట్ ఆల్ రౌండర్లలో ఒకడు. ఇప్పటివరకు 50 ఓవర్ల ఫార్మాట్ లో 138 వన్డేలు ఆడి 2,355 పరుగులు చేశాడు. బౌలింగ్ లోనూ సత్తా చాటి 111 వికెట్లు పడగొట్టాడు. 68 టెస్టుల్లో 3000 పైగా పరుగులు.. 200 పైగా వికెట్లు పడగొట్టాడు. 2014లో మొయిన్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి ఇంగ్లండ్ తరఫున మూడు ఫార్మాట్‌లు ఆడాడు. 2019లో సొంతగడ్డపై ఇంగ్లాండ్ వన్డే వరల్డ్ కప్.. 2022 లో టీ20 వరల్డ్ కప్ గెలుచుకున్న జట్టులో అలీ సభ్యుడు. 2024 సెప్టెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ రాబోయే ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడనున్నాడు.