మొఘల్, డైన్​ హిల్ ​రెస్టారెంట్లలోమేయర్​ ఫుడ్​ సేఫ్టీ తనిఖీలు

  • కిచెన్లలో మాంసం స్టోర్​ చేయడంపై ఫైర్​
  • శాంపిల్స్​కలెక్ట్​ చేసిల్యాబ్​కు పంపాలని ఆదేశం
  • లైసెన్స్ ​లేకుండా డైన్ హిల్ మండీ నడుస్తున్నట్లు గుర్తింపు

హైదరాబాద్ సిటీ, వెలుగు: లక్డీకాపూల్​లోని మొఘల్ రెస్టారెంట్, మాసబ్ ట్యాంక్​లోని డైన్ హిల్ మండీని జీహెచ్ఎంసీ మేయర్​గద్వాల్​ విజయలక్ష్మి బుధవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఫుడ్​సేఫ్టీ అధికారులతో కలిసి కిచెన్, వాష్​ ఏరియాలను పరిశీలించారు. మొఘల్ రెస్టారెంట్ కిచెన్ అపరిశుభ్రంగా ఉండడాన్ని చూసి నిర్వాహకులపై మండిపడ్డారు. అక్కడే ప్రిజర్వ్ చేసిన మాంసాన్ని గుర్తించారు. వెంటనే శాంపిల్స్ కలెక్ట్ చేసి ల్యాబ్​కు పంపాలని అధికారులను ఆదేశించారు. ఫుడ్ కలర్స్ వినియోగంపై హోటల్ నిర్వాహకులను ప్రశ్నించారు. డైన్ హిల్ మండీ రెస్టారెంట్​ట్రేడ్ ​లైసెన్స్​ ఎక్స్పైర్ ​అయినట్లు గుర్తించారు. కిచెన్ అపరిశుభ్రంగా ఉండడాన్ని చూసి నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. అక్కడి ఫ్రిడ్జ్​లో పాడైన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

తనిఖీలు కొనసాగుతాయ్..

ఈ సందర్భంగా మేయర్​ విజయలక్ష్మి మాట్లాడుతూ.. హోటల్స్ నిర్వాహకులు పరిశుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్​లో స్టోర్​చేసి, మళ్లీ వేడి చేసి కస్టమర్లకు సర్వ్​ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలను పాటించని హోటళ్లను మూసివేసేందుకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న హోటళ్లపై చర్యలు తీసుకుంటామన్నారు. మాంసాహార పదార్థాల కొనుగోలు రసీదులను వెటర్నరీ అధికారులు పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేయర్ వెంట హెల్త్ అడిషనల్ కమిషనర్ పంకజ, చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్, సీఎంహెచ్ఓ డాక్టర్ పద్మజ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఫుడ్​సేఫ్టీ అధికారులతో జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో సమావేశమై దిశానిర్దేశం చేశారు. హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ వెండర్స్ షాపులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ప్రతిఒక్కరూ కచ్చితంగా ట్రేడ్ ​లైసెన్స్​ తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.  

కుళ్లిన మటన్.. బొద్దింకలు గుర్తింపు

ఎల్బీనగర్: నాగోల్​లోని సామ్రాట్ బార్ అండ్ రెస్టారెంట్, దసరా రెస్టారెంట్, నవరస రెస్టారెంట్లలోనూ బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలు పాటించట్లేదని గుర్తించారు. నాన్ వెజ్ వంటకాల్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలుపుతున్నట్లు, ఎక్స్పైర్​అయిన పాలు, బ్రెడ్, మసాలాలు, బ్లాక్ సాల్ట్, పసుపు, సాస్ వాడుతున్నట్లు తేల్చారు. కిచెన్​లో బొద్దింకలు తిరుగుతున్నాయని, కిచెన్లు అపరిశుభ్రంగా ఉన్నాయని గుర్తించారు. దసరా రెస్టారెంట్​లో కుళ్లిపోయిన మటన్ వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. నాగోలులోని రాఘవేంద్ర హోటల్, కర్మన్ ఘాట్​లోని రాఘవేంద్ర టిఫిన్స్​లో ఎల్బీనగర్ జోన్ ఫుడ్ సెఫ్టీ అధికారులు, జోన్ ఇన్​చార్జ్ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో తనిఖీలు కొనసాగాయి.