Champions Trophy 2025: బుమ్రా లేడు.. భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుంది: పాకిస్థాన్ పేసర్

Champions Trophy 2025: బుమ్రా లేడు.. భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుంది: పాకిస్థాన్ పేసర్

ఛాంపియన్స్ ట్రోఫీలో మ్యాచ్ లు ఏకపక్షంగా సాగుతున్నాయి. గ్రూప్ ఏ లో తొలి రెండు మ్యాచ్ లు చప్పగా ముగిసాయి. టోర్నీ తొలి మ్యాచ్ లో ఆతిధ్య పాకిస్థాన్ పై న్యూజిలాండ్ 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గురువారం (ఫిబ్రవరి 20) బంగ్లాదేశ్ పై ఇండియా సునాయాసంగా గెలిచింది. దీంతో గ్రూప్ ఏ లో కివీస్, టీమిండియా ముందంజలో ఉండగా.. పాకిస్థాన్, బంగ్లాదేశ్ సెమీస్ రేస్ లో వెనకపడ్డాయి. బంగ్లాదేశ్ ను పక్కనపెడితే సొంతగడ్డపై పాకిస్థాన్ సెమీస్ కు వెళ్లకపోతే ఆ జట్టుకు ఘోర అవమానం తప్పదు. ఈ నేపథ్యంలో తమ జట్టుకు మాజీ స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ మద్దతు పలికాడు. 

గ్రూప్ ఏ లో భారత జట్టు సెమీస్ కు వెళ్లకుండా త్వరగా నిష్క్రమిస్తుందని జోస్యం చెప్పాడు.  భారత్ గ్రూప్ దశ దాటి ముందుకు సాగదని  అమీర్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. ఒక ప్రైవేట్ టీవీ ఛానెల్‌లో మాట్లాడుతూ.. "గ్రూప్ ఎ లో న్యూజిలాండ్ అత్యంత సమతుల్యత కలిగిన జట్టు. ఇండియా సెమీస్ కు చేరడం కష్టం. జస్‌ప్రీత్ బుమ్రా లేకపోవడం టీమిండియాకు అతి పెద్ద ఎదురుదెబ్బ. మహ్మద్ షమీ గాయం నుండి తిరిగి వచ్చినా భారత్ సెమీస్ కు చేరదు. గ్రూప్ ఏ నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ సెమీ-ఫైనల్స్‌కు చేరుకుంటాయి. దుబాయ్‌లో జరిగే గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడిస్తుంది". అని అమీర్ చెప్పుకొచ్చాడు. 

భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 23) మ్యాచ్ జరుగుతుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు ఒక రకంగా చావో రేవో లాంటిది. ఈ మ్యాచ్ లో ఓడిపోతే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. తొలి మ్యాచ్ లో 60 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆ జట్టుకు ఎదురు దెబ్బ. భారత్ మిగిలిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచినా సెమీస్ కు చేరుతుంది. న్యూజిలాండ్ పరిస్థితి కూడా అంతే. బంగ్లాదేశ్ పై మ్యాచ్ ఆడడం కివీస్ కు కలిసి రానుంది. బంగ్లాదేశ్ సెమీస్ కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్ ల్లో గెలవాల్సిందే.