వీళ్ళకి రిటైర్మెంట్ అంటే లెక్కే లేదు: మనసు మార్చుకున్న మరో పాక్ ప్లేయర్

వీళ్ళకి రిటైర్మెంట్ అంటే లెక్కే లేదు: మనసు మార్చుకున్న మరో పాక్ ప్లేయర్

పాకిస్థాన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్లేయర్స్ ఒకొక్కరుగా అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చేనందుకు సిద్ధంగా ఉన్నారు. నిన్న (మార్చి 23) పాకిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ ఇమాద్ వసీం తన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే  పాకిస్థాన్ సూపర్ లీగ్ లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ స్పిన్ ఆల్ రౌండర్.. పాక్ తరపున ఆడాలనే తన కోరికను బయట పెట్టాడు.  శనివారం సోషల్ మీడియా వేదికగా తన నిర్ణయాన్ని వెల్లడించాడు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన పేసర్ మహమ్మద్ అమీర్ పాక్ జట్టుకు ఆడటానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. 

వెస్టిండీస్,USAలలో జరగబోయే ICC T20 ప్రపంచ కప్ కు మహ్మద్ అమీర్ అంతర్జాతీయ రిటైర్మెంట్ నుండి వెనక్కి వస్తున్నట్లు తన నిర్ణయాన్ని తెలిపాడు. ఇమాద్ వసీం ప్రకటించిన 24 గంటలలోపే అమీర్ టీ20 వరల్డ్ కప్ కు అందుబాటులో ఉంటాడని తెలియజేయడం విశేషం. 2023లో పాక్ మాజీ టీమ్ డైరెక్టర్ మహ్మద్ హఫీజ్ అతను పాకిస్తాన్ జాతీయ జట్టులోకి తిరిగి రావాలని ఆఫర్ చేశాడు. అయితే అప్పుడు అమీర్ తన నిర్ణయాన్ని నిరాకరించాడు.

31 ఏళ్ల ఈ పాక్ ఫాస్ట్ బౌలర్ పీసీబీతో  చర్చలు జరిపిన తర్వాత తన అంతర్జాతీయ రిటైర్మెంట్‌పై యు-టర్న్ తీసుకున్నాడు. స్పాట్ ఫిక్సింగ్ కారణంగా ఆమీర్ నిషేధం ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత 2019లో టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ లీగ్ ల్లో అదరగొడుతున్నాడు. మరోవైపు ఇమాద్ వసీం గతేడాది ఆఖరిలో అంతర్జాతీయ క్రికెట్‌కు వసీం  గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌లలో వసీం భాగమయ్యాడు. ఇప్పుడు ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్ జరగనుండడంతో వసీంతో పీసీబీ చర్చలు జరిపింది.