కరాచీ : పాకిస్తాన్ వివాదాస్పద పేసర్ మహ్మద్ ఆమిర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు మరోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇదివరకే ఓసారి ఆటకు వీడ్కోలు పలికి గత టీ20 వరల్డ్ కప్ కోసం తిరిగి బరిలోకి దిగిన ఆమిర్ ఇకపై మూడు ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు శనివారం తెలిపాడు. స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కున్న ఆమిర్ 2010 నుంచి 2015 వరకు ఐదేండ్ల పాటు నిషేధం ఎదుర్కొన్నాడు.
కొన్నాళ్లు జైలుకు కూడా వెళ్లిన పాక్ పేసర్ 2020లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వైదొలిగాడు. కానీ, ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్‌లో పోటీ పడ్డాడు. 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇండియాను ఓడించి పాక్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్‌లో 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ20ల్లో పోటీ పడి మొత్తంగా 271 వికెట్లు పడగొట్టాడు.