పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్ ఎంత గ్రేట్ బ్యాటర్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వన్డేల్లో నెంబర్ వన్ ర్యాంక్ లో ఉన్న బాబర్.. మూడు ఫార్మాట్ లలో టాప్ 5 లో ఉన్న ఏకైక బ్యాటర్ గా నిలిచాడు. ఆడిన 104 వన్డేల్లోనే 19 సెంచరీలు చేసి భవిష్యత్తులో విరాట్ కోహ్లీ రికార్దులు బ్రేక్ చేస్తాడని ఇప్పటికే పలు క్రికెట్ నిపుణులు జోస్యం చెప్పేసారు. ఇక పాకిస్థాన్ ఫ్యాన్స్ అయితే కోహ్లీ రికార్డులు బ్రేక్ చేసేది బాబర్ అజామ్ అని పొంగిపోతున్నారు. ప్రపంచంలో ఎంతో మంది బాబర్ ని పొగుడుతుంటే.. పాక్ మాజీ బౌలర్ మహమ్మద్ ఆసిఫ్ మాత్రం బాబర్ ని తక్కువగా అంచనా వేసాడు.
ఆడింది తక్కువ మ్యాచులే అయినప్పటికీ ఆసిఫ్ తన స్వింగ్ తో బ్యాటర్లను వణికించాడు. ముఖ్యంగా టెస్టుల్లో అతని స్వింగ్ తట్టుకోలేక టాప్ బ్యాటర్లు సైతం వికెట్ సమర్పించుకుంనేవారు. మంచి బౌలరే అయినప్పటికీ బాబర్ అజామ్ తన బౌలింగ్ ఆడలేడని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. ఈ సందర్భంగా ఆసిఫ్ మాట్లాడుతూ " నేను ఈ రోజు కూడా T20 క్రికెట్‌లో బాబర్ అజామ్‌కి మెయిడిన్ ఓవర్ వేయగలను. మీరు అతనికి మంచి డెలివరీలు వేస్తే అతను బంతిని కొట్టలేడు". అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఆసిఫ్ చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మాజీ పాక్ ప్లేయర్ అయ్యుండి ఇలా స్టార్ ప్లేయర్ ని కించపరిచే విధంగా మాట్లాడడంతో ఇప్పుడు ఈ మాజీ బౌలర్ పై విమర్శలు వర్షం కురుస్తుంది. మరి ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలు ఎంత దూరం వెళ్తాయో చూడాలి. కాగా.. ఆసిఫ్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి పాక్ జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. అతని కెరీర్ లో వివాదాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి.