Mohammad Nabi: నా కొడుకుతో ఆడాలని ఉంది.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ దిగ్గజం

Mohammad Nabi: నా కొడుకుతో ఆడాలని ఉంది.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ దిగ్గజం

ఆఫ్ఘనిస్తాన్ స్టార్ క్రికెటర్ మొహమ్మద్ నబీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అందరినీ ఆశ్చర్యపరిచాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాలనే తన మనసులోని మాట బయటపెట్టాడు. వాస్తవానికి నబీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి వైదొలగాలనుకున్నాడు. కానీ ఇప్పుడు మనసు మార్చుకొని మరి కొంతకాలం క్రికెట్ లో కొనసాగాలని తన కోరికను తెలిపాడు. నబీ రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం వెనక ఉన్న కారణాన్ని వెల్లడించాడు. 

18 ఏళ్ల తన కొడుకు హసన్ ఐసాఖిల్‌తో అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని ఉందని తెలిపాడు. నబీ మాట్లాడుతూ " ఛాంపియన్స్ ట్రోఫీ నా చివరి టోర్నీ కాకపోవచ్చు. వీలైనంత తక్కువ వన్డేలు ఆడి యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాను. నేను సీనియర్ ఆటగాళ్లతో చర్చించాను. నేను ఇప్పటివరకు ఆడతానో నా ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుంది.  దేశం కోసం నా కొడుకు ఐసాఖిల్ తో  కలిసి ఆడటం నా కల. నా కోరిక తీరుతుందని ఆశిస్తున్నాను. ఐసాఖిల్ క్రికెట్ లో చాలా బాగా రాణిస్తున్నాడు. కష్టపడే ,మనస్తత్వం కలవాడు". అని నబీ చెప్పాడు. 

Also Read : ప్రిడిక్షన్ చూస్తే నవ్వుకోవాల్సిందే

ప్రస్తుతం నబీ వయస్సు.. 39 ఏళ్లు. 1985 జనవరి ఒకటో తారీఖున జన్మించిన ఈ ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ మరో రెండు నెలల్లో 40వ వసంతంలోకి ఆడగు పెట్టనున్నాడు. ఈ నేపథ్యంలో తప్పుకోవాలని అతను తీసుకున్న నిర్ణయం సమ్మతించదగినదే. అందునా, యువ క్రికెటర్లు ఒక్కొక్కరిగా ఆఫ్ఘన్ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నారు. 2009లో అఫ్గాన్‌ జట్టు తరఫున అరంగేట్రం చేసిన నబీ 165 వన్డేల్లో 3,549 పరుగులు చేయడంతో పాటు 171 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ ఆల్​రౌండర్ల విభాగంలో అగ్రస్థానం దక్కించుకున్న నబీ.. అత్యధిక వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. బంగ్లా ఆల్​రౌండర్ షకీబల్ హసన్​ను వెనక్కినెట్టి నబీ టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు.