నాకు మెంటల్.. నన్ను సెలక్ట్ చేయకండి.. క్రికెటర్ అభ్యర్థన

నాకు మెంటల్.. నన్ను సెలక్ట్ చేయకండి.. క్రికెటర్ అభ్యర్థన

బంగ్లాదేశ్ పేస్ బౌలింగ్ ఆల్ రౌండర్ మహ్మద్ సైఫుద్దీన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రెండు నెలల విరామం కావాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ)ని అభ్యర్థించాడు. డిప్రెషన్‌తో బాధపడుతున్నందున తనని జాతీయ జట్టుకు ఎంపిక చేయొద్దని కోరాడు. క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం అతను ఈ విషయాన్ని స్వయంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియ‌జేసిన‌ట్లు తెలుస్తుంది. బీసీబీ కూడా అత‌డి నిర్ణయాన్ని గౌరవించినట్టు సమాచారం. 

బంగ్లాదేశ్‌లోని రాజకీయ గందరగోళం కారణంగా అతను తన గ్లోబల్ T20 కెనడా టోర్నమెంట్ కోసం వీసా పొందలేకపోయాడు. గ్లోబల్ T20 తో పాటు ఇటీవలే ముగిసిన టీ20 వరల్డ్ కప్ కు ఈ ఆల్ రౌండర్ దూరమయ్యాడు. పాకిస్థాన్ తో బంగ్లాదేశ్ ఈ నెలలో టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఆగస్టు 21 నుంచి ప్రారంభం కానున్న ఈ సిరీస్ కోసం బంగ్లాదేశ్ పాకిస్థాన్ లో పర్యటించనుంది. ఈ సిరీస్ కు ముందు పాకిస్థాన్ తో బంగ్లాదేశ్ ఏ జట్టు కొన్ని మ్యాచ్ లు ఆడనుంది. ఈ జట్టులో సైఫుద్దీన్‌కు సెల‌క్ట‌ర్లు చోటిచ్చారు. 

ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో బాగా ఆడితే ప్రధాన మ్యాచ్ లకు సెలక్ట్ చేసే ఉద్దేశ్యంలో సెలక్టర్లు ఉన్నారు. అయితే ఇంతలోనే సైఫుద్దీన్‌ తనని ఎంపిక చేయవద్దని షాక్ ఇచ్చాడు. బంగ్లాదేశ్ తరపున 29 వన్డే మ్యాచ్ లు.. 38 టీ20 మ్యాచ్ లు ఆడాడు. 2017 లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన సైఫుద్దీన్‌..  2024 లో చివరిసారిగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు.