నెల రోజుల భక్తి... ఏడాదంతా స్ఫూర్తి .. నేడు ఈద్​ ఉల్​ ఫితర్

నెల రోజుల భక్తి... ఏడాదంతా స్ఫూర్తి ..  నేడు ఈద్​ ఉల్​ ఫితర్

షవ్వాల్ నెలవంక తొంగి చూసింది. అత్యంత పవిత్రంగా కఠోర  నియమ, నిష్టలతో  కొనసాగించిన రంజాన్ నెలకు ముస్లింలు ఘనంగా వీడ్కోలు పలికారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు (రోజా)లు కొనసాగించి ఇక సంతోషంగా ఈద్ ఉల్ ఫితర్  పండుగ సంబురాలు జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. బుధవారం సాయంత్రం నెలవంక దర్శనం ఇవ్వడంతో ఉలేమాలు గురువారం ఈద్ ఉల్ ఫితర్  వేడుకలు జరుపుకోవాలని ప్రకటించారు. పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు ఆకలి, దప్పికల నుంచి ఓర్పు, సహనం అనే సద్గుణాలను నేర్చుకున్నారు. 

ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే తత్వాన్ని అలవర్చుకున్నారు. 30 రోజుల  పాటు చేపట్టిన దీక్షలు, ప్రార్థనలతో పొందిన నైతిక విలువలను వచ్చే ఏడాదంతా స్ఫూర్తిగా కొనసాగించడానికి సంసిద్ధులయ్యారు.  ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే రంజాన్ పండుగ బుధవారం భక్తిశ్రద్ధలు, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పండుగ ప్రాధాన్యం, నెల రోజులుగా చేపట్టిన ఉపవాస దీక్షలు (రోజా)లతో నేర్చుకున్న శిక్షణ  ముస్లింలందరు పాటించాలని మతపెద్దలు, ఉలేమాలు చెబుతున్నారు. 

షవ్వాల్​ మాసంలోని మొదటి రోజు కనిపించే   నెలవంక తర్వాత  ప్రత్యేక దువా చేసి ఈద్​ఉల్​ఫితర్​ పండుగ జరుపుకుంటారు. ఈద్ ఉల్ ఫితర్  పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది.  ముస్లింలు పండుగ రోజు ఉదయాన్నే తలస్నానం చేసి, కొత్త దుస్తులు ధరించి ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకొని ఈద్​ ముబారక్​ అంటూ శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ఈ నేపథ్యంలో ఈద్గాహ్ వద్ద భారీ ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.  అనంతరం రంజాన్​ పండుగ రోజున షీర్​ ఖుర్మా చేసుకొని నోరు తీపి చేసుకుంటారు. ధనికులు, పేదలు అనే తారతమ్యం లేకుండా  సమాజంలోని అందరూ ఒకే విధమైన దినచర్య పాటిస్తారు. ఈ పండుగ ఆరోగ్యకర పద్ధతులు,  శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పుతుందని నమ్మకం. పండుగ తర్వాత మరో ఆరు రోజుల పాటు షవ్వాల్​ దీక్షలు  పాటిస్తారు.

ప్రత్యేక దువా

ముస్లింలు పండుగకు ముందు రోజు రాత్రి షవ్వాల్  నెల నెలవంక కనిపించిన తర్వాత ప్రత్యేక దువా ( ప్రార్థన) చేస్తారు. అప్పటితో ఉపవాస దీక్షలు ముగుస్తాయి. ఈద్ ఉల్ ఫితర్  రోజు సూర్యోదయానికి ముందు నిద్రలేస్తారు. ఉదయం ఫజర్ నమాజ్ చేస్తారు. అందరూ సంప్రదాయ స్నానాలు  (గుసుల్) చేస్తారు. అనంతరం కొత్త బట్టలు ధరిస్తారు. చాలా మంది లాల్చీ, పైజామా ధరిస్తారు.  ఈద్ ( పండుగ ) రోజు ఉపవాసం ఉండకూడదని  ఖురాన్ చెబుతోంది. ఈద్ ఉల్ ఫితర్ నమాజు కంటే ముందు ' జకాత్ ' చెల్లిస్తారు.  ఇస్లాం ఐదు మూల స్తంభాల్లో జకాత్ నాలుగోది. పండుగ రోజున నమాజ్​కు ముందు పేదలకిచ్చే దానమే ఫిత్రా. అందుకే 
ఈ పండుగకు ఈద్​ ఉల్​ ఫితర్​ అని పేరు వచ్చింది. 

రంజాన్​ స్పెషల్​  ‘షీర్​ఖుర్మా’ 

రంజాన్​ పండుగ రోజు అందరి దృష్టి  ‘ షీర్​ఖుర్మా' పైనే ఉంటుంది.  పండుగ రోజు నమాజ్​ ముగిశాక మిత్రులు, బంధువులు, ఆత్మీయులతో పంచుకునేందుకు వారందరిని ఇండ్లకు ఆహ్వానిస్తారు. వారికి  షీర్​ ఖుర్మాతో  విడదీయరాని అనుబంధం ఉంది. ఉపవాసాలు, ఐదుపూటల నమాజ్​, చివరి పది రోజుల్లో ఎతెఖాఫ్​, షబే ఖదర్​, జాగరణ రాత్రులతో నెల రోజుల పాటు ముస్లింలు ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు. చివరి రోజు ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత ముస్లింలు సోదరభావంతో  హిందువులకూ ' షీర్​ ఖుర్మా '  అందిస్తారు.

రంజాన్ మాసం దానధర్మాలకు ప్రతీక:ముఫ్తి మొయిజ్ షాంజి, మత గురువు

అత్యంత నియమ, నిష్టలతో  పవిత్ర రంజాన్ మాసపు ఉపవాస దీక్షలు చేపట్టి షవ్వాల్  నెలవంక చూసిన తర్వాత ఈద్ ఉల్ ఫితర్​ పండుగ జరుపుకుంటాం. పేదల ఆకలి బాధలు తెలుసుకొని ఈద్ నమాజ్​కు ముందే ప్రతి ఒక్కరు విధిగా  ఫిత్రా, జకాత్  చెల్లించాలి. ఇదే  పవిత్ర రంజాన్ మాసం ఆశయం.  ప్రేమ, కరుణ, సోదరభావం, పరమత సహనం ఇస్లాం ప్రధాన ఉద్దేశం.  రంజాన్ మాసమంతా అనుక్షణం సర్వ మానవాళి  సుఖ సంతోషాల కోసమే  ప్రార్థిస్తాం.  ఇస్లాం మూల సిద్ధాంతాలు కలిమా, నమాజ్,  రోజా,  జకాత్,  హజ్ ఐదు అంశాలపై ఉన్నాయి. ఈ నెలలో దైవ ప్రార్థన, బీదలకు తనవంతు సాయం, ప్రేమాభిమానాలతో గడిపిన జీవన విధానం మిగిలిన 11 నెలలు పాటు ఆచరించాలని పవిత్ర ఖురాన్ లో అల్లాహ్ నిర్దేశించారు. అల్లాహ్ సన్మార్గంలో ముస్లింలందరు నడవాలి.

దివి నుంచి భువికి ఖురాన్​

ముస్లింలకు అతి పవిత్రమైన మాసం రంజాన్.  ఖురాన్​ గ్రంథం దివి నుంచి భూమికి ఈ మాసంలోనే వచ్చింది. ఈ నెలలో ఉపవాస దీక్షతో శరీరాన్ని శుద్ధి చేసుకోవడం ద్వారా ఆత్మ ప్రక్షాళన అవుతుంది.  దీంతో  మోహం, మదం, కోపతాపాలు  అదుపులో ఉంటాయి. రంజాన్​ మాసంలో  ముస్లింలు అందరూ ఉపవాస దీక్షలు  ఆచరించడం తప్పనిసరి.  ఖురాన్​లో  సూచించినట్లుగా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 30 రోజుల పాటు పాటించే దీక్షల్లో చుక్క నీరు కూడా సేవించరు. ఇలా 30 రోజుల పాటు కఠోర నియమాలతో ఉపవాస దీక్ష చేస్తారు. ఉపవాస దీక్షలతో  మనో నిగ్రహం కలుగుతుంది. ఆకలి విలువ తెలుస్తుంది. కోరికలు దహించుకుపోతాయి. ప్రేమ, అభిమానం, క్రమశిక్షణ, కర్తవ్యం తదితర గుణాలు దరి చేరతాయి. ఎన్నో ప్రత్యేకతలతో సాగే రంజాన్​ మాసం ఈద్​ ఉల్​ ఫితర్​​ వేడుకలతో ముగుస్తుంది.  

- మొహమ్మద్ 
  షౌకత్ అలీ, 
మెట్​పల్లి,  
జగిత్యాల జిల్లా