భద్రాచలం, వెలుగు: సాధారణ జీవితం గడుపుతున్న మహ్మద్ హుస్సేన్‌ను మంచిర్యాల పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ బుధవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. రెండు నెలల నుంచి సి.కా.స పునర్నిర్మాణం కోసం మందమర్రి, రామకృష్ణాపూర్ ఏరియాల్లో మావోయిస్టు భావజాలాన్ని తీసుకెళ్తున్నారని, కరపత్రాలు పంచుతున్నారనే నెపంతో అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
పారిపోతుంటే పట్టుకున్నామని చెప్తున్నారని, 73 ఏండ్ల వృద్ధుడు ఎలా పారిపోతాడాని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని నిరుద్యోగులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారన్నారు. మావోయిస్టులను నిర్మూలనకు అదనపు సాయుధ బలగాలు, నిధులు కావాలని, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ క్యాంపులను భద్రాద్రి జిల్లా చర్ల మండలం కొండవాయి, ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో ఏర్పాటు చేయాలని, వామపక్ష తీవ్రవాద జిల్లాలుగా గతంలో ఉండి తొలగించిన మూడు జిల్లాలను సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్ పెండేచర్ (ఎస్ఆర్ఈ) స్టేటస్‌ను తిరిగి కొనసాగించాలని కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం కోరారని జగన్ ప్రస్తావించారు.