రాష్ట్రపతి చేతుల మీదుగా.. అర్జున అవార్డు అందుకున్న మహమ్మద్ షమీ

మహమ్మద్ షమీ కష్టానికి ప్రతిఫలం దక్కింది. కెరీర్ ప్రారంభం నుంచి అద్భుత ప్రదర్శన చేస్తున్న ఈ సీనియర్ బౌలర్ కు ఎట్టకేలకు అర్జున అవార్డు లభించింది. వరల్డ్ కప్ లో టాప్ క్లాస్ బౌలింగ్ తో అదరగొట్టిన ఈ వెటరన్ పేసర్ పేరును అర్జున అవార్డుకు బీసీసీఐ సిఫారసు చేయగా నేడు భారత రాష్ట్రపతి చేతుల మీదగా ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మొత్తం 23 మంది అర్జన అవార్డును తీసుకోగా.. ఈ అవార్డు అందుకున్న ఏకైక క్రికెటరగా షమీ నిలిచాడు.         

షమీ 2023 ICC క్రికెట్ ప్రపంచ కప్ అసాధారణ బౌలింగ్ చేసాడు. ప్రారంభ మ్యాచ్ ల్లో అవకాశం రాకపోయినా.. ఆ తర్వాత ఆడిన 7 మ్యాచ్ ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 2023 లో మొత్తం 19 వన్డేలాడిన ఈ సీనియర్ పేసర్ 43 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్ లాడిన షమీ.. 13 వికెట్లు పడగొట్టాడు. 

అర్జున అవార్డు ఆందుకున్న షమీ.. ANIతో మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు కల అని..ఈ ప్రతిష్టాత్మక అవార్డు కు నామినేట్ అయినందుకు సంతోషంగా ఉందని ఎమోషనల్ అయ్యాడు. ఈ క్షణం నా జీవితంలోనే అత్యుత్తమమైనదని.. కల నిజమైనందుకు సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. వరల్డ్ కప్ లో చివరిసారిగా ఆడిన షమీ ఆ తర్వాత టీంఇండియాలో కనిపించలేదు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్ కు దూరమయ్యాడు.