టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వన్డే జట్టులోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు 15 నెలల తర్వాత షమీ వన్డే మ్యాచ్ ఆడబోతున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాపై ఫైనల్ మ్యాచ్ ఆడిన తర్వాత షమీకి ఇదే తొలి వన్డే. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన టీ20 సిరీస్ కు రీ ఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ పేసర్.. ఇక వన్డేలపై దృష్టి పెట్టనున్నాడు. ఇంగ్లాండ్ తో గురువారం (ఫిబ్రవరి 6) నాగ్ పూర్ వేదికగా జరగనున్న తొలి వన్డే ఆడేందుకు సిద్ధమయ్యాడు. రీ ఎంట్రీలో తొలి మ్యాచ్ లోనే షమీ వరల్డ్ రికార్డ్ పై కన్నేశాడు.
ALSO READ | Ranji Trophy: హర్యానా- ముంబై రంజీ వేదిక మార్పు.. బీసీసీఐ కుట్ర అంటున్న అభిమానులు!
ఇంగ్లాండ్ తో రేపు జరగబోయే తొలి వన్డేలో షమీ 5 వికెట్లు తీసుకుంటే వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసుకున్న బౌలర్ గా ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ రికార్డ్ సమం చేస్తాడు. వన్డేల్లో వేగంగా 200 వికెట్లు తీసుకున్న రికార్డ్ స్టార్క్ పేరిట ఉంది. 102 ఇన్నింగ్స్ ల్లో స్టార్క్ ఈ ఘనతను అందుకున్నాడు. మరోవైపు షమీ 101 ఇన్నింగ్స్ ల్లో 195 వికెట్లు పడగొట్టాడు. నాగ్ పూర్ వన్డేలో షమీ 5 వికెట్లు తీస్తే స్టార్క్ తో సమానంగా వేగంగా 200 వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలుస్తాడు.
2023 వన్డే వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు బుమ్రా అందుబాటులో లేకపోవడంతో షమీపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఫిబ్రవరి 6న (గురువారం) నాగ్‌పూర్‌లో తొలి వన్డే జరగనుంది. రెండో వన్డే ఫిబ్రవరి 9న కటక్‌లో జరగనుండగా, మూడో మరియు చివరి మ్యాచ్ ఫిబ్రవరి 12న అహ్మదాబాద్‌లో జరగనుంది.
వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్లు
మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా) – 102 ఇన్నింగ్స్
సక్లైన్ ముస్తాక్ (పాకిస్తాన్) – 104 ఇన్నింగ్స్
ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్) – 107 ఇన్నింగ్స్
బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) – 112 ఇన్నింగ్స్
అలన్ డోనాల్డ్ (దక్షిణాఫ్రికా) – 117 ఇన్నింగ్స్
వకార్ యూనిస్ (పాకిస్తాన్) – 118 ఇన్నింగ్స్
షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 125 ఇన్నింగ్స్
మఖాయ ఎన్టిని (దక్షిణాఫ్రికా) – 126 ఇన్నింగ్స్
లసిత్ మలింగ (శ్రీలంక) – 127 ఇన్నింగ్స్
మిచెల్ జాన్సన్ (ఆస్ట్రేలియా) – 129 ఇన్నింగ్స్