Mohammed Shami: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. రంజీ ట్రోఫీ ఆడనున్న షమీ

Mohammed Shami: ఏడాది తర్వాత రీ ఎంట్రీ.. రంజీ ట్రోఫీ ఆడనున్న షమీ

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ రీ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఆతను ఏడాది తర్వాత తొలిసారి మ్యాచ్ ఆడబోతున్నాడు. బుధవారం (నవంబర్ 13) నుండి మధ్యప్రదేశ్‌తో ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బెంగాల్ తరపున షమీ ఆడనున్నాడు. ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఫిట్ నెస్ లేని కారణంగా ఆస్ట్రేలియాతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఎంపికైన 18 మంది స్క్వాడ్ లో షమీ చోటు దక్కించుకోలేకపోయాడు. రంజీ ట్రోఫీలో సత్తా చాటి త్వరలోనే టీమిండియాలో ఎంట్రీ ఇవ్వాలని షమీ ప్రయత్నాలు చేస్తున్నాడు. 

స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయంతో సర్జరీ చేయించుకున్న ఈ స్పీడ్ స్టార్ ఆ తర్వాత బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. బంగ్లాదేశ్ తో  టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడని భావించిన అది సాధ్యపడలేదు. ఆ తర్వాత న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ తో పాటు.. ఆస్ట్రేలియాలో జరగనున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరమయ్యాడు. 

ALSO READ | Virat Kohli: ఆస్ట్రేలియాలో కింగ్ హవా.. న్యూస్​ పేపర్​ ఫ్రంట్ పేజీపై కోహ్లీ ఫోటో

గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురైన ఈ పేసర్.. సుమారు ఎనిమిది నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో ఈ సర్జరీ నిర్వహించారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్ లకు దూరమయ్యాడు.