Mohammad Shami: భార‌త జ‌ట్టుకు గుడ్‌న్యూస్.. షమీ వ‌చ్చేస్తున్నాడు

Mohammad Shami: భార‌త జ‌ట్టుకు గుడ్‌న్యూస్.. షమీ వ‌చ్చేస్తున్నాడు

భారత సీనియర్ పేసర్ మ‌హ‌మ్మద్ ష‌మీ పున‌రాగ‌మ‌నం చేయ‌నున్నాడు. మోకాలి స‌ర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న ష‌మీ ప్రస్తుత రంజీ సీజన్ 2024-25లో బెంగాల్ జ‌ట్టు త‌ర‌ఫున రెండు లేదా మూడు మ్యాచ్‌లు ఆడనున్నాడు. ఈ విషయాన్ని బెంగాల్ కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా వెల్లడించారు.

వచ్చే నెలలో భారత జట్టు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్‌లో షమీ కీలకం కానున్నాడు. ఈ క్రమంలో అక్కడ గాడిలో పడాలంటే, ముందుగా తగినంత ప్రాక్టీస్ అవసరం కనుక రంజీ ట్రోఫీలో ఆడాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 6 నుంచి కర్ణాటకతో జరిగే మ్యాచ్‌కి ముందు షమీ బెంగాల్ జట్టులో చేరే అవకాశం ఉంది. ఈ స్పీడ్‌స్టర్ మధ్యప్రదేశ్‌తో ఇండోర్‌ వేదికగా జరగనున్న  తదుపరి మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం ఉంది.

ALSO READ | IND vs NZ 2nd Test: ఆ ఇద్దరినీ జట్టులోకి తీసుకొని రండి.. భారత ఫ్యాన్స్ డిమాండ్

"రంజీ ట్రోఫీలో ష‌మీ బెంగాల్ జట్టు త‌ర‌ఫున ఆడ‌నున్నాడు. అతను కేర‌ళ‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేడు. కానీ, త్వర‌లోనే జ‌ట్టుతో కలిసే అవకాశముంది. క‌ర్నాట‌క‌, మ‌ధ్యప్రదేశ్‌ల‌తో మ్యాచ్‌ల స‌మ‌యానికి అతను జ‌ట్టుతో కలవచ్చు.." అని లక్ష్మీ ర‌త‌న్ వెల్లడించారు.

కాగా, గతేడాది వన్డే ప్రపంచకప్ నాటి నుండి ఎలాంటి క్రికెట్ ఆడని షమీ.. ప్రస్తుతం నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ(NCA)లో శిక్షణ పొందతున్నాడు. ప్రస్తుతం త‌న‌ మోకాలి నొప్పి పూర్తిగా త‌గ్గిపోయింద‌ని, ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు ఈ మధ్యనే వెల్లడించాడు. అతను బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.