Mohammed Shami: రంజీల్లో మహమ్మద్ షమీ.. టీమిండియా రీ ఎంట్రీ అప్పుడే

Mohammed Shami: రంజీల్లో మహమ్మద్ షమీ.. టీమిండియా రీ ఎంట్రీ అప్పుడే

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ టీమిండియా రే ఎంట్రీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయంతో సర్జరీ చేయించుకున్న ఈ స్పీడ్ స్టార్ ఇటీవలే  బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. దీంతో బంగ్లాదేశ్ తో సెప్టెంబర్ లో జరగబోయే టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉంటాడని అంతా భావించారు. అయితే ఇప్పుడు షమీ రంజీ ట్రోఫీ బాట పట్టనున్నాడు. 

34 ఏళ్ల షమీ సెప్టెంబర్ లో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్ కు దూరం కానున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి అతడు రంజీ ట్రోఫీ ఆడనున్నాడని తెలుస్తుంది. తన సొంత జట్టు బెంగాల్ తరపున  అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్ ఆడడానికి షమీ సిద్ధమయ్యాడని తెలుస్తుంది. ఈ మ్యాచ్ తో పాటు కోల్‌కతాలో బీహార్‌తో అక్టోబర్ 18న మ్యాచ్ కు షమీ అందుబాటులో ఉంటాడు. రంజీ ట్రోఫీలో కేవలం ఈ పేసర్ రెండు మ్యాచ్ లే ఆడనున్నాడని సమాచారం. దీని ప్రకారం షమీ అక్టోబర్ లో న్యూజిలాండ్ తో జరగబోయే మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడు.    

గతేడాది వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురైన ఈ పేసర్.. సుమారు ఎనిమిది నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో ఈ సర్జరీ నిర్వహించారు.  ఈ క్రమంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్ లకు దూరమయ్యాడు.