టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ కోసం భారత క్రికెట్ జట్టు ఎదురు చూస్తుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా పేస్ బౌలర్ గా షమీ కీలకం కానున్నాడు. ఈ నేపథ్యంలో గాయపడిన షమీ త్వరగా కోలుకొని భారత జట్టులోకి రావాలని ఆశతో ఉంది. శ్రీలంకతో వన్డే సిరీస్ తర్వాత టీమిండియాకు 40 రోజుల రెస్ట్ లభించనుంది. ఈ లోపు షమీ కోలుకుంటాడని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ చెప్పుకొచ్చాడు. షమీ బౌలింగ్ ప్రారంభించడం ఆనదంగా ఉందని.. సెప్టెంబర్ లో బంగ్లాదేశ్ తో జరగబోయే సిరీస్ కు రావాలనే లక్ష్యంతో ఉన్నాడని అగార్కర్ అన్నారు.
షమీ గత నెలలో బౌలింగ్ వేయడం ప్రారంభించాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో షమీ దాదాపు పూర్తి ఫిట్ నెస్ ను సాధించాడు. అయితే అతను భారత జట్టులోకి చేరాలంటే ముందు దులీప్ ట్రోఫీలో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 5న ఈ టోర్నీ ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌లో బంగ్లాదేశ్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ టూర్‌లో ఇరు జట్లు రెండు టెస్టులు, మూడు టీ20ల్లో తలపడనున్నాయి.
గతేడాది వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. 2023లో తన సంచలన ప్రదర్శనకు గాను షమీ ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును అందుకున్నాడు. 33 ఏళ్ళ ఈ సీనియర్ పేసర్ స్వదేశంలో బంగ్లాదేశ్ పై జరగబోయే టెస్టు సిరీస్ సమయానికల్లా కోలుకుంటాడని బీసీసీఐ సెక్రటరి జైషా తెలిపాడు.