Mohammed Shami: నేపాల్ క్రికెటర్లకు షమీ సూచనలు

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనేందుకు నేపాల్ క్రికెట్ జట్టు భారత్‌ వచ్చింది. ఇక్కడ  రెండు వారాల పాటు ఉండనుంది. ఐసీసీ మెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2 కోసం నేపాల్ బెంగళూరులో శిక్షణా శిబిరాన్ని ప్రాక్టీస్ గా ఉపయోగించుకుంటుంది. నేపాల్ క్రికెట్ జట్టు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండగా భారత స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ నేపాల్ క్రికెటర్లతో కొంత సమయం గడిపాడు.

బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఆ జట్టుకు తన విలువైన సూచనలు ఇస్తూ సందడి చేశాడు. ప్రస్తుతం షమీ కూడా ఇక్కడే ఉండడంతో నేపాల్ క్రికెట్ జట్టును కలుసుకొని ముచ్చటించాడు. నేపాల్‌ భారత్‌లో పర్యటించడం ఈ ఏడాది రెండోసారి. అంతకుముందు ప్రపంచకప్‌కు సన్నాహకంగా గుజరాత్‌లో కొన్ని శిక్షణ పొందుతున్న సమయంలో బరోడాతో జరిగిన కొన్ని మ్యాచ్‌లలో జట్టు పాల్గొంది. ఇది నేపాల్ గుజరాత్, బరోడాతో జరిగిన  ముక్కోణపు సిరీస్. 

షమీ విషయానికి వస్తే సెప్టెంబర్ లో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్ కు దూరం కానున్నాడు. పూర్తి ఫిట్ నెస్ సాధించడానికి అతడు రంజీ ట్రోఫీ ఆడనున్నాడని తెలుస్తుంది. తన సొంత జట్టు బెంగాల్ తరపున  అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్‌తో మ్యాచ్ ఆడడానికి షమీ సిద్ధంగా ఉన్నాడు. ఈ మ్యాచ్ తో పాటు కోల్‌కతాలో బీహార్‌తో అక్టోబర్ 18న మ్యాచ్ కు షమీ అందుబాటులో ఉంటాడు. రంజీ ట్రోఫీలో కేవలం ఈ పేసర్ రెండు మ్యాచ్ లే ఆడనున్నాడని సమాచారం. దీని ప్రకారం షమీ అక్టోబర్ లో న్యూజిలాండ్ తో జరగబోయే మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు అందుబాటులో ఉండనున్నాడు.