Mohammed Shami: మహమ్మద్ షమీ పూర్తి ఫిట్.. రీ ఎంట్రీకి అంతా సిద్ధం

స్వదేశంలో జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత మహమ్మద్ షమీ భారత జట్టుకు దూరమయ్యాడు. చీలమండ గాయంతో సర్జరీ చేయించుకున్న ఈ స్పీడ్ స్టార్ ఇటీవలే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. తాజాగా భారత క్రికెట్ లో ఎంట్రీ ఇవ్వడానికి తాను సిద్ధం అని ఈ స్పీడ్ స్టార్ సోషల్ మీడియాలో తెలిపాడు. ప్రస్తుతం షమీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. షమీ బౌలింగ్ చూస్తుంటే త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిట్ నెస్ పై కసరత్తులు చేస్తూ టీమిండియా తలుపులు తట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు.   

Also Read:-టీమిండియాతో సిరీస్.. గాయంతో లంక స్టార్ పేసర్ ఔట్

గతేడాది వరల్డ్ కప్ లో షమీ 24 వికెట్లు తీసి టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత మడమ గాయానికి గురైన ఈ పేసర్.. సుమారు ఎనిమిది నెలలుగా టీమిండియాకు దూరంగా ఉన్నాడు. ఫిబ్రవరి నెలలో ఎడమ చీలమండకు సర్జరీ చేయించుకున్నాడు. లండన్‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌లో ఈ సర్జరీ నిర్వహించారు.  ఈ క్రమంలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్, ఇంగ్లండ్ సిరీస్ లకు దూరమయ్యాడు.

గాయం ఎంతకీ మానకపోవడంతో సర్జరీ తప్పదన్న నేషనల్ క్రికెట్ అకాడెమీ ఫిజియోల సూచన మేరకు మడమకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ సర్జరీతో అతడు ఐపీఎల్ 2024 తో పాటు టీ20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. 2023లో తన సంచలన ప్రదర్శనకు గాను షమీ ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డును అందుకున్నాడు. 33 ఏళ్ళ ఈ సీనియర్ పేసర్ స్వదేశంలో బంగ్లాదేశ్ పై జరగబోయే టెస్టు సిరీస్ సమయానికల్లా కోలుకుంటాడని బీసీసీఐ సెక్రటరి జైషా తెలిపాడు.