గాయం కారణంగా జట్టుకు దూరమైన టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఎట్టకేలకు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. 14 నెలల సుధీర్ఘ నిరీక్షణ అనంతరం తిరిగి షమీ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 2025, జనవరి 22 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం శనివారం (జనవరి 11) బీసీసీఐ టీమిండియా స్క్వాడ్‌ను అనౌన్స్ చేసింది. 15 మందితో కూడిన ఈ జట్టులో పేసర్ మహ్మద్ షమీని ఎంపిక చేసింది బీసీసీఐ. గాయం కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరమైన షమీని ఎట్టకేలకు సెలక్ట్ చేసింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫిలో అద్భుతంగా రాణించిన భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా, మహ్మద్ సిరాజ్‌కు ఈ సిరీస్‌కు బీసీసీఐ రెస్ట్ ఇచ్చింది. భవిష్యత్‌నూ దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా యువ ఆటగాళ్లకే బీసీసీఐ ప్రాధాన్యత ఇచ్చింది.
మహ్మద్ షమీ చివరగా 2023 నవంబర్‌లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో ఇండియా తరఫున ఆడాడు. ఈ మెగా టోర్నీలో అద్భుతంగా రాణించిన షమీ.. భారత్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. దురదృష్టవశాత్తూ ఇదే టోర్నీలో షమీ గాయపడ్డాడు. 2024 ఫిబ్రవరిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్నాడు. రెస్ట్ అనంతరం షమీ తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. ఫిట్నెస్ కోసం ఎన్సీఏలో తీవ్రంగా కసరత్తు చేశాడు. సెలక్షన్ కమిటీకి తాను మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని నిరూపించుకునేందుకు దేశవాళీ క్రికెట్ ఆడాడు.
రంజీ ట్రోఫీలో బెంగాల్ తరఫున మధ్యప్రదేశ్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగిన షమీ.. ఏడాది విరామం తర్వాత క్రికెట్ ఆడిన ఎలాంటి ఇబ్బంది లేకుండా 42.3 ఓవర్లు బౌలింగ్ చేసి7 వికెట్లు తీశాడు. ఆ తర్వాత సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నమెంట్ బరిలోకి దిగిన షమీ.. 19 రోజుల్లో తొమ్మిది మ్యాచ్‌ల్లో పోటీ పడ్డాడు. అన్నింటిలోనూ తన నాలుగు ఓవర్ల పూర్తి కోటా బౌలింగ్ చేశాడు. మొత్తంగా 68 ఓవర్లు బౌలింగ్ చేసి 18 వికెట్లు పడగొట్టడంతో బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టులకైనా అతను అందుబాటులోకి వస్తాడన్న ప్రచారం జరిగింది.
కానీ, ముస్తాక్ అలీ టోర్నీ సందర్భంగా కొన్ని మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసిన తర్వాత అతని మోకాలులో వాపు వచ్చినట్టు ఎన్‌సీఏ ఫిజియోలు గుర్తించారు. ఈ కారణంగానే బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో చివరి రెండు మ్యాచ్‌లకు అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. చాలా కాలం విరామం తర్వాత ఎక్కువ తీవ్రతతో బౌలింగ్ చేస్తుండటంతో అతని మోకాలిలో వాపు వస్తోందని గత నెల నాలుగో వారంలో బీసీసీఐ ప్రకటించింది. ఈ పరిణామాల తర్వాత విజయ్ హజారే వన్డే టోర్నమెంట్‌లో బెంగాల్ ప్రారంభ మ్యాచ్‌లకు షమీ దూరంగా ఉన్నాడు.
కానీ, చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో పోటీపడ్డాడు. ఈ పరిణామాల అనంతరం దాదాపు 14 నెలల తర్వాత మళ్లీ టీమిండియా నుంచి షమీకి పిలుపు వచ్చింది. స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు మహ్మద్ షమీని బీసీసీఐ ఎంపిక చేసింది. దీంతో 14 నెలల తర్వాత జాతీయ జట్టు తరుఫును షమీ గ్రౌండ్లో అడుగు పెట్టబోతున్నాడు.
ఫిబ్రవరిలో చాంఫియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సిరీస్ షమీకి అగ్ని పరీక్షగా మారనుంది. ఈ సిరీస్‌లో రాణిస్తేనే ఛాంఫియన్స్ ట్రోఫిలో షమీకి జట్టులో స్థానం దక్కనుంది. యువకుల నుండి ఉన్న పోటీ దృష్ట్యా ఈ సిరీస్‌లో షమీ విఫలం అయితే.. అతడి కెరీర్ ఇక ముగిసినట్లేనని క్రీడా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సో.. ఇంగ్లాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్ షమీకి డూ ఆర్ డై గా మారనుంది.
ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కి భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ , వరుణ్ చకరవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్).