వరల్డ్ కప్ లో టాప్ వికెట్ టేకర్ గా కొనసాగుతున్న షమీ ఊరిలో కొత్త క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. షమీ ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో ఉన్న సహస్‌పూర్ అలీనగర్ గ్రామానికి చెందినవాడు. అమ్రోహా జిల్లా యంత్రాంగం షమీ స్వస్థలంలో మినీ-స్టేడియం నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనను పంపాలని.. గ్రామంలో వ్యాయామశాలను ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ ప్రాంతంలో మరింత మంది యువ క్రికెటర్లను తయారు చేసేందుకు కొత్త స్టేడియం సహాయపడుతుంది.
దీని గురించి అమ్రోహా జిల్లా మేజిస్ట్రేట్ రాజేష్ త్యాగి (IAS) మాట్లాడుతూ.. 'మహ్మద్ షమీ గ్రామంలో మినీ స్టేడియం నిర్మించాలని మేము ఒక ప్రతిపాదనను పంపుతున్నాము. ఆ ప్రతిపాదనలో ఓపెన్ జిమ్నాసియం కూడా ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 20 స్టేడియంలను నిర్మించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా అమ్రోహా స్టేడియంను కూడా దీనికి ఎంపిక చేసాం'. అని ఆయన అన్నారు. మినీ స్టేడియం, వ్యాయామశాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించేందుకు శుక్రవారం డీఎం త్యాగి నేతృత్వంలోని బృందం షమీ గ్రామాన్ని సందర్శించింది.
అమ్రోహాలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో షమీ 2005లో మంచి అవకాశాల కోసం కోల్‌కతా వెళ్లాడు. షమీ బెంగాల్ రాష్ట్ర జట్టులో చోటు సంపాదించడానికి ముందు క్లబ్ మ్యాచ్‌లలో తన ప్రదర్శనతో కోల్‌కతా కోచ్‌లను ఆకట్టుకున్నాడు. తన అద్భుత ప్రదర్శనతో 2013లో భారత జట్టులో చోటు సంపాదించాడు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని షమీ తుది జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ లో షమీ కేవలం 6 మ్యాచ్ ల్లోనే 23 వికెట్లు పడగొట్టాడు. ఈ ఫాస్ట్ బౌలర్ యావరేజ్ 9 మాత్రమే. వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ 50 వికెట్స్ తీసుకున్న ఆటగాడిగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. కీలకమైన సెమీ ఫైనల్లో 7 వికెట్లు తీసుకొని భారత్ ఫైనల్ కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు.