జూబ్లీహిల్స్‌లో సిరాజ్‌కు ఇంటి స్థలం.. ప్రభుత్వం జీవో జారీ

టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు, హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూబ్లీహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 78లో 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. కాగా, టీ20 ప్రపంచకప్‌ విజయం అనంతరం సిరాజ్‌ హైదరాబాద్‌ చేరుకున్నాక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు టీమిండియా జెర్సీని బహూకరించాడు.

మహ్మద్ సిరాజ్‌తో పాటు, షూటర్ ఈషా సింగ్, రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్‌లకు హైదరాబాద్‌లో ఒక్కొక్కరికి 600 చదరపు గజాల ఇంటి స్థలాలను కేటాయిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. సిరాజ్, నిఖత్ జరీన్‌లకు వారి వారి క్రీడా రంగాల్లో సహకారంపై ప్రభుత్వం గ్రూప్-1 ఉద్యోగాలను కూడా కేటాయించింది.

రూ.125 కోట్ల నజరానాలోనూ వాటా

టీ20 ప్రపంచకప్‌ జట్టులో భాగమైన 15 మంది ఆటగాళ్లలో ఒకరైన సిరాజ్ కు.. బీసీసీఐ ప్రకటించిన రూ.125 కోట్ల నజరానాలోనూ వాటా దక్కింది.