IND vs AUS: సిరాజ్ ఏం చేశాడు.. ఆస్ట్రేలియా మీడియాలో ఎందుకీ విమర్శలు

IND vs AUS: సిరాజ్ ఏం చేశాడు.. ఆస్ట్రేలియా మీడియాలో ఎందుకీ విమర్శలు

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ పేరు ఆస్ట్రేలియా మీడియాలో మార్మోగుతోంది. అంతలా మనోడు బంతితో అద్భుతం చేశాడా..! అనుకోకండి. బంతితో మనోడి ప్రదర్శన గుండు సున్నా. హద్దులు దాటి.. అత్యుత్సాహం చూపి టీవీల్లోకి ఎక్కాడు.

అసలేం జరిగిదంటే..?

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో సిరాజ్ నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించాడు. ఆఖరి క్షణంలో తప్పుకున్నాడన్న కోపంతో సహనం కోల్పోయి ప్రత్యర్థి బ్యాటర్‌‌పైకి బంతిని విసిరేసాడు. భారత బౌలర్ చర్యల పట్ల అంపైర్‌ సైతం ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్ లో చోటు చేసుకుంది.  

Also Read:-దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్!

25వ ఓవర్‌లో నాలుగో బంతిని సిరాజ్ వేయబోగా.. ఆ సమయంలో క్రీజులో ఉన్న ఆసీస్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ చివరి క్షణంలో నిరాకరించాడు.  సిరాజ్ రనప్ తీసుకుంటున్న సమయంలో గ్రౌండ్ సిబ్బంది బౌలర్ వెనుక ఏదో వస్తువును తీసుకువెళ్తున్నట్లు అనిపించడంతో లబుషేన్.. బౌలర్‌కి తన పరుగును ఆపమని సంకేతం ఇచ్చాడు. సిరాజ్ మాత్రం బ్రేకుల్లేని బండిలా అలానే దూసుకెళ్లాడు. చేసేదేమీ లేక ఆసీస్ బ్యాటర్ క్రీజు నుంచి పక్కకు తప్పుకున్నాడు. దాంతో సహనం కోల్పోయిన సిరాజ్.. బంతిని వికెట్ల వైపు విసిరేసాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

భారత బౌలర్‌పై విమర్శలు

సిరాజ్ చర్యలను భారత అభిమానులు సైతం సమర్ధించడం లేదు. ఈ మధ్యనే హైదరాబాద్ డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సిరాజ్ ఇలా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం సరికాదన్న మాటలు వినపడుతున్నాయి. వికెట్లు తీయవు కానీ, వీటికేం తక్కువ లేదని అర్థం వచ్చేలా మీమ్స్ పోస్టులు పెడుతున్నారు.