SRH vs GT: చాలా రోజులు ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాను: మహమ్మద్ సిరాజ్

SRH vs GT: చాలా రోజులు ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాను: మహమ్మద్ సిరాజ్

ఐపీఎల్ 2025 లో టీమిండియా స్టార్ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ అదరగొడుతున్నాడు. ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున ఆడుతున్న ఈ హైదరాబాదీ పేసర్.. నాలుగు మ్యాచ్ ల్లో 9 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల లిస్ట్ లో రెండో స్థానంలో ఉన్నాడు. గత సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ తరపున అట్టర్ ఫ్లాప్ అయిన సిరాజ్.. ఈ సీజన్ లో మాత్రం దుమ్ములేపుతున్నాడు. ఆదివారం (ఏప్రిల్ 6) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

సొంతగడ్డపై రైజర్స్ ఆటను ఆస్వాదించాలని ఆశించిన ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌ను మహ్మద్ సిరాజ్ (4/17) నిరాశకు గురి చేశాడు. గుజరాత్ టైటాన్స్‌‌‌‌‌‌‌‌కు ఆడుతున్న సిరాజ్ లీగ్‌లో కెరీర్ బెస్ట్ బౌలింగ్‌‌‌‌‌‌‌‌తో విజృంభించిన వేళ  రైజర్స్ హిట్టర్లంతా మరోసారి ఫ్లాపయ్యారు. సిరాజ్ విజృంభణతో ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ తర్వాత సిరాజ్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో తనను తప్పించడంపై పరోక్షంగా అసంతృప్తి వ్యాఖ్యలు చేశాడు. 

Also Read : తొలి బంతికే బౌండరీ కన్ఫర్మ్

సిరాజ్ మాట్లాడుతూ.. " ఛాంపియన్స్ ట్రోఫీలో చోటు దక్కనందుకు నేను జీర్ణించుకోలేకపోయాను. కానీ ఆ తర్వాత నా బౌలింగ్, ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాను. నా బలహీనతలను తెలుసుకొని నెట్స్ లో తీవ్రంగా శ్రమించాను. నేను ఇప్పుడు నా బౌలింగ్ ను ఆస్వాదిస్తున్నాను. భారత జట్టుకు ఎంపిక కాకపోయినా.. ఐపీఎల్ లో రాణించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఆర్సీబీ జట్టు తరపున 7 ఏళ్ళ ఆడాను. ఆ జట్టుకు ప్రత్యర్థిగా ఆడడం ఎమోషనల్ కు గురి చేసింది. హైదరాబాద్ లో ఆడడం ఎల్లప్పుడూ ప్రత్యేకమే". అని సిరాజ్ అన్నాడు. 

ఫిబ్రవరి నెలలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో సిరాజ్ స్థానం దక్కించుకోవడంలో విఫలమయ్యాడు. భారత సెలక్టర్లు ప్రకటించిన 15 మంది స్క్వాడ్ లో సిరాజ్ పై వేటు పడింది. ఖచ్చితంగా ప్లేయింగ్ 11 లో ఉంటాడన్న సిరాజ్ కనీసం స్క్వాడ్ లో కూడా ఎంపిక చేయలేదు. సిరాజ్ ను పక్కన పెట్టడానికి కారణం లేకపోలేదు. భారత జట్టులో గత ఏడాది కాలంగా వరుస అవకాశాలు దక్కించుకున్నప్పటికీ తన అత్యున్నత ప్రదర్శన ఇవ్వలేకపోవడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది. అనుభవం దృష్ట్యా సిరాజ్ ను ఎంపిక చేయాల్సిందని చాలా మంది తమ అభిప్రాయాన్ని తెలిపారు.