ఇంగ్లాండ్ తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ కు భారత ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లకు రెస్ట్ లభించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరగబోయే ఈ మెగా టోర్నీకి ముందు ఈ కీలక పేసర్లకు రెస్ట్ ఇవ్వాలని భావిస్తోందట. ఇటీవలే ఆస్ట్రేలియాతో 5 టెస్ట్ సిరీస్ లు ఆడిన బుమ్రా, సిరాజ్ లపై పని భారం తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. బుమ్రా, సిరాజ్ లకు రెస్ట్ ఇస్తే వారి స్థానంలో లెఫ్టర్మ్ పేసర్ అర్షదీప్ సింగ్ తో పాటు ప్రసిద్ కృష్ణలకు చోటు దక్కనుంది.
అర్షదీప్ భారత్ తరపున 8 వన్డేలాడాడు. మరోవైపు ప్రసిద్ కృష్ణ 17 వన్డేలాడాడు. వీరిద్దరి ఇంగ్లాండ్ సిరీస్ లో రాణిస్తే ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపికయ్యే ఛాన్స్ ఉంది. వీరిద్దరూ బుమ్రా, సిరాజ్ లకు బ్యాకప్ లుగా సెలక్ట్ అవ్వొచ్చు. మహమ్మద్ షమీ విషయంలో ఇంకా ఎలాంటి అప్ డేట్ లేదు. ఒకవేళ షమీ కోలుకుంటే అతడిని ఇంగ్లాండ్ సిరీస్ కు సెలక్ట్ చేయడం ఖాయం. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి మెగా టోర్నీకి షమీ అనుభవం భారత్ కు ఎంతో కీలకం.
ఆరు నెలలుగా టెస్టులతో బిజీగా మారిన టీమిండియా తర్వాత మూడు నెలల పాటు పరిమిత ఓవర్ల క్రికెట్ పై దృష్టి పెట్టనుంది. ఇటీవలే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 1-3 తేడాతో ఓడిపోయిన టీమిండియా.. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు జరగనున్నాయి.ఈ సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది.
భారత్ vs ఇంగ్లండ్ వైట్-బాల్ సిరీస్ షెడ్యూల్
మొదటి టీ20: జనవరి 22 (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
రెండో టీ20: జనవరి 25 (చిదంబరం స్టేడియం, చెన్నై)
మూడో టీ20: జనవరి 28 (నిరంజన్ షా స్టేడియం, రాజ్‌కోట్)
నాలుగో టీ20: జనవరి 31 (MCA స్టేడియం, పూణె)
ఐదో టీ20: ఫిబ్రవరి 2 (వాంఖడే స్టేడియం, ముంబై)
మొదటి వన్డే: ఫిబ్రవరి 6 (VCA స్టేడియం, నాగ్‌పూర్)
రెండో వన్డే: ఫిబ్రవరి 9 ఆదివారం (బారాబతి స్టేడియం, కటక్)
మూడో వన్డే: ఫిబ్రవరి 12 (నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్)