హైదరాబాద్, వెలుగు : ఇండియా టీ20, వన్డే జట్టులో చోటు కోల్పోయిన పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ స్టార్ ప్లేయర్లు రోహిత్, జడేజా బాటలో రంజీ ట్రోఫీలో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో నిరాశపరిచిన సిరాజ్‌ను ఇంగ్లండ్‌తో టీ20, వన్డే సిరీస్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు సెలెక్టర్లు ఎంపిక చేయలేదు. పాత బంతితో అతను మెరుగ్గా బౌలింగ్ చేయలేకపోతున్నాడని కెప్టెన్ రోహిత్ చెప్పాడు.
ఈ నేపథ్యంలో డొమెస్టిక్ క్రికెట్ ఆడి తిరిగి ఫామ్ అందుకోవాలని సిరాజ్ భావిస్తున్నాడు. ఈ నెల 30 నుంచి విదర్భతో హైదరాబాద్ ఆడే చివరి మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. ఈ క్రమంలో మంగళవారం జింఖానా గ్రౌండ్‌లో అతను ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నాడు. అక్కడి నెట్స్‌లో బౌలింగ్ చేశాడు. రంజీ ట్రోఫీలో ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ ఒక్కదాంట్లోనే గెలిచింది.