మీడియాపై మోహన్​బాబు రౌడీయిజం.. మైకులు గుంజుకొని దాడి

మీడియాపై మోహన్​బాబు రౌడీయిజం.. మైకులు గుంజుకొని దాడి
  • మోహన్​బాబు ఇంటి పంచాది గరం గరం
  • తండ్రికి మద్దతుగా దుబాయ్‌‌‌‌ నుంచి ఫామ్​హౌస్​కు చేరుకున్న విష్ణు
  • అప్పటికే అక్కడికి భార్యతో కలిసి వచ్చిన మనోజ్​.. తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్‌‌‌‌/పహాడీషరీఫ్‌‌‌‌, వెలుగు: సినిమా నటుడు మంచు మోహన్​బాబు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు తారాస్థాయికి చేరాయి. ఒకరిపై ఒకరు దాడి, ప్రతిదాడులు చేసుకున్నారు. మోహన్​బాబుకు మద్దతుగా పెద్దకొడుకు మంచు విష్ణు ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌కు చేరుకున్న వెంటనే పరిస్థితి మరింత హీటెక్కింది. 

మంగళవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏం జరుగుతున్నదో తెలుసుకునేందుకు అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై మోహన్​బాబు రెచ్చిపోయారు. చేతుల్లోంచి మైకులను గుంజుకొని.. మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. 

దాడిని జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. అక్కడే ఆందోళనకు దిగారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వరుస ఘటనలతో ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మోహన్​బాబు, విష్ణు గన్స్‌‌‌‌ను రాచకొండ పోలీసులు సీజ్ చేశారు. బుధవారం ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు. 

  • మోహన్‌‌‌‌బాబు, విష్ణు వర్సెస్‌‌‌‌ మనోజ్‌‌‌‌ 

ఆస్తి వివాదాలు, కుటుంబ కలహాల కారణంగా మోహన్‌‌‌‌బాబు, ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్‌‌‌‌ మధ్య ఆదివారం ఉదయం గొడవ జరిగింది. తండ్రీ, కొడుకు ఒకరిపై ఒకరు చేసుకున్న ఫిర్యాదుల మేరకు పహాడీషరీఫ్ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మంగళవారం ఉదయం వీరిద్దరి స్టేట్‌‌‌‌మెంట్స్ రికార్డ్‌‌‌‌ చేయడంతో పాటు సాక్షులను విచారించేందుకు ప్రయత్నించారు. అయితే ఇంట్లో గొడవ జరిగిన సంగతి తెలిసిన వెంటనే దుబాయ్‌‌‌‌లో నుంచి మోహన్​బాబు పెద్ద కొడుకు మంచు విష్ణు హైదరాబాద్‌‌‌‌కు తిరుగు పయనమయ్యారు. 

మంగళవారం ఉదయం శంషాబాద్ ఎయిర్‌‌‌‌‌‌‌‌పోర్టులో దిగగానే.. మోహన్‌‌‌‌బాబు రిసీవ్‌‌‌‌ చేసుకుని నేరుగా జల్‌‌‌‌పల్లిలోని ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌ కమ్​ ఇంటికి  తీసుకువచ్చారు. అయితే అప్పటికే మనోజ్‌‌‌‌, ఆయన భార్య మౌనిక అక్కడ ఉన్నారు. విష్ణు వచ్చిన కొద్దిసేపటికే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మోహన్‌‌‌‌బాబు అనుచరులు, బౌన్సర్లు ఓ వైపు.. మంచు మనోజ్‌‌‌‌ బౌన్సర్లు మరోవైపు పోటాపోటీగా ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. 

అయితే అప్పటికే అక్కడున్న పోలీసులు మనోజ్‌‌‌‌ బౌన్సర్లను బయటకు పంపించారు.  అనుచరులు బయటికి వచ్చిన కొద్దిసేపటికి మనోజ్, మౌనిక దంపతులు కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. గేట్‌‌‌‌ వద్ద మీడియాతో మనోజ్​మాట్లాడారు. ‘‘నేను ఆస్తుల కోసమో డబ్బు కోసమో ఆశపడడంలేదు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నా. నా భార్యపై మౌనికపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నాకు జరిగిన అన్యాయం పెద్దల దృష్టికి తీసుకెళ్తాను. న్యాయం జరిగే వరకు పోరాడుతాను” అని మనోజ్​ అన్నారు. అనంతరం మళ్లీ ఇంట్లోకి వెళ్లారు.

  • చిరిగిన షర్టుతో మనోజ్

భార్య మౌనికతో కలిసి ఇంట్లోకి వెళ్లిన మనోజ్ ఆ తర్వాత బయటకు వచ్చారు. మోహన్‌‌‌‌బాబు, విష్ణు, మనోజ్‌‌‌‌  మధ్య గొడవ జరిగినట్లు తెలిసింది. అక్కడి నుంచి మనోజ్​ లక్డీకపూల్‌‌‌‌లోని డీజీపీ ఆఫీస్‌‌‌‌కు చేరుకున్నారు. లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ డీజీ మహేశ్​ భగవత్‌‌‌‌ని కలిశారు. తన తండ్రి మోహన్‌‌‌‌బాబు నుంచి ప్రాణహాని ఉందని.. దుండగులు, బౌన్సర్లతో తనపై దాడి చేయించారని ఫిర్యాదు చేశారు. తనకు, తన భార్యకు, కూతురుకు రక్షణ కల్పించాలని కోరారు. దీంతో రాచకొండ సీపీని కలిసి అవసరమైన సహాయం పొందాలని ఏడీజీ మహేశ్​ భగవత్‌‌‌‌ సూచించారు. 

అనంతరం మనోజ్‌‌‌‌..  మళ్లీ ఫామ్‌‌‌‌హౌస్‌‌‌‌కు చేరుకున్నారు. దీంతో మరోసారి అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.  లోపలికి వెళ్లిన కొద్దిసేపటికి మనోజ్​ చిరిగిన షర్టుతో బయటకు వచ్చారు. ఇదంతా కవర్‌‌‌‌‌‌‌‌ చేస్తున్న మీడియాపై మోహన్‌‌‌‌బాబు రౌడీయిజం ప్రదర్శించారు. మీడియా మైకులను గుంజుకొని.. మీడియా ప్రతినిధులపై దాడికి తెగబడ్డారు. కాగా, నాలుగురోజులుగా ఫ్యామిలీలో జరుగుతున్న గొడవల వల్ల మోహన్‌‌‌‌బాబు, ఆయన భార్య అస్వస్థతకు గురయ్యారు. వారిద్దరినీ హాస్పిటల్‌‌‌‌కు విష్ణు తరలించారు. ఫ్యామిలీలో గొడవలపై మోహన్​బాబు ఓ ఆడియో రికార్డు విడుదల చేశారు. మంచు మనోజ్​ రోడ్డెక్కి తన పరువు తీశాడని అందులో ఆయన పేర్కొన్నారు.