ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న మోహన్ బాబు, ఇప్పుడు ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మంచు విష్ణు నిర్మించారు. ఈ నెల 18న సినిమా విడుదలవుతున్న సందర్భంగా మోహన్‌బాబు ఇలా ముచ్చటించారు.
‘‘ఓ ఎమ్మెల్యే వల్ల సామాన్యుడు ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డాడు, చెయ్యని తప్పుకు ఎలా జైలు పాలయ్యాడనేది కథ. నాకు తెలిసిన వాళ్లు కూడా చాలామంది అలా జైళ్లలో ఉన్నారు. నేరం చేసిన వాళ్లొకరు, శిక్ష అనుభవిస్తోంది మరొకరు. అందుకే ప్రైవేటు బస్సులు, స్కూళ్లు, కాలేజీలు, హాస్పిటల్స్ ఉన్నట్టే, దేశంలో ప్రైవేట్ జైల్స్ కూడా ఉండాలంటాడు ఇందులో హీరో. కులాల కుమ్ములాటలపై కూడా డైలాగ్స్ఉన్నాయి. కచ్చితంగా మోహన్‌బాబు మంచి సినిమా తీశాడు అంటారు. కానీ సూపర్‌హిట్ అవుతుందని మాత్రం చెప్పను. ఎందుకంటే అలా చెప్పడం మానేశాను. సక్సెస్, ఫెయిల్యూర్‌కి ముందే ప్రిపేరయ్యా. సినిమా డ్యూరేషన్ గంటన్నరే. ఓటీటీ కోసం అనుకుని, ఇప్పుడు థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. ఇక నేను జీవితంలో బానిస అయింది కోపానికే. నా కోపం నాకే నష్టాన్ని కలిగిస్తోంది. అయినా సగం జీవితం అయిపోయింది. ఇప్పుడు బ్రతుకుతున్నదంతా బోనస్. డైరెక్షన్ చేయడం కోసం రెండు స్క్రిప్ట్స్ రెడీ చేశాను. కానీ చెప్పిన టైమ్‌కి ఎవరు రారు కనుక సెట్‌లో రోజుకు ఒకరిని కొడతానని భయం. నా లైఫ్ స్టోరీపై ఓ బుక్ రెడీ అవుతోంది. ఇంకా టైటిల్ ఏదీ అనుకోలేదు. తిరుపతిలో బాబా గుడి కడుతున్నాం. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ బాబా గుడి దర్శించుకు వెళ్లేలా అద్భుత నిర్మాణం జరుగుతోంది. ఇటీవల మంత్రి పేర్ని నాని గారు ఓ పెళ్లికి హైదరాబాద్ వస్తే, బ్రేక్ ఫాస్ట్‌కి రమ్మని ఆహ్వానించాను. సరదాగా మాట్లాడుకున్నాం. దాన్ని కొందరు చెత్త చెత్తగా ఊహించుకుంటే ఎలా..? ‘జగన్ గారు ఏం మాట్లాడారు, మా సినిమా వాళ్లు ఆయనతో ఏం మాట్లాడారో చెప్పండి’ అని నేనెలా ఆయన్ని అడగగలను. నా ఇంటికి చాలామంది విఐపీలు వచ్చి పోతుంటారు. దాన్ని తప్పుబడితే ఎలా.? మహానటుడు ఎన్టీఆర్ నాకు అన్నయ్య. చంద్రబాబు బంధువు. అందుకే అప్పుడు ప్రచారానికి వెళ్లాం. ఆ తర్వాత జగన్ కూడా బంధువు. వీళ్లకూ ప్రచారం చేయాలి కదా అని చేశాం, అయిపోయింది. సినిమాలు, యూనివర్సిటీ పనులే నాకు బోలెడు ఉన్నాయి. అందుకే ఈ జన్మకి ఇక పాలిటిక్స్ వద్దనుకున్నాను’’.