యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్న మోహన్ బాబు


సీనియర్ నటుడు మోహన్ బాబు తన పేరుతో యూనివర్సిటీని ప్రారంభించనున్నారు. ఇప్పటికే శ్రీ విద్యా నికేతన్ పేరుతో విద్యా సంస్థలను నడుపుతున్న విషయం తెలిసిందే. నటుడిగా, నిర్మాతగా చలన చిత్ర రంగంలో ఎంతో పేరు సంపాదించిన ఆయన శ్రీ విద్యానికేతన్ ను స్థాపించి విద్యా రంగంలోనూ స్ఫూర్తిగా నిలిచారు. తాజాగా ఆయన తిరుపతిలో మోహన్ బాబు యూనివర్సిటీ (ఎంబీయూ)ని కూడా ప్రారంభిస్తున్నట్లు మోహన్ బాబు ప్రకటించారు. ఈ మేరకు ట్వీట్ చేసి వెల్లడించారు. 
‘అభిమానులు, ఆత్మీయులు శ్రీ విద్యా నికేతన్ లో వేసిన విత్తనాలు ఇప్పుడు కల్ప వృక్షాలుగా మారాయి. 30 ఏళ్లుగా మీ నమ్మకం.. విశ్వాసం.. ప్రేమాభిమానాలే నాకు కొండంత బలం.. వినూత్న తరహాలో విద్యనందించాలనే  నా జీవిత లక్ష్యం ఇప్పుడు అత్యున్నత స్థాయికి చేరింది.  నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాసుల దీవెనలతో యూనివర్సిటీని ప్రారంభిస్తున్నాను. నా  ఈ కలకి కూడా మద్దతిచ్చి అండగా నిలుస్తారని విశ్వసిస్తున్నాను’.. అంటూ మోహన్ బాబు ట్వీట్ చేశారు.