హైదరాబాద్: జర్నలిస్టుపై దాడి కేసులో ప్రముఖ నటుడు మంచు మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. అరెస్ట్ నుండి రక్షణ కల్పించలేమంటూ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది హైకోర్టు. దీంతో పోలీసులు మోహన్ బాబును అరెస్ట్ చేసేందుకు సిద్ధం అయ్యారని.. ఈ విషయం తెలుసుకున్న డైలాగ్ కింగ్ పరారయ్యాడని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ప్రస్తుతం మోహన్ బాబు ఇంట్లో లేరని.. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మోహన్ బాబు పరారీ వార్తలపై పోలీసులు వివరణ ఇచ్చారు. మోహన్ బాబు పరారీలో ఉన్నారని.. ఆయన కోసం స్పెషల్ టీమ్స్ సెర్చ్ చేస్తున్నారని జరుగుతోన్న ప్రచారం ఫేక్ అని క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం (డిసెంబర్ 13) వెపన్ డిపాజిట్ కోసం మోహన్ బాబు ఇంటికి వెళ్లగా ఆయన అందుబాటులో లేరు.
రెండు మూడు రోజుల్లో వచ్చి వెపన్ డిపాజిట్ చేస్తానని మాకు మోహన్ బాబు సమాచారం ఇచ్చారని పోలీసులు వెల్లడించారు. మోహన్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పరారీలో ఉన్నారని.. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని స్పష్టం చేశారు పోలీసులు. ఆయన మాకు సమాచారం అందించాడని తెలిపారు.
అసలేం జరిగిందంటే..?
గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతోన్న విషయం తెలిసిందే. మోహన్ బాబుకు ఆయన చిన్న కుమారుడు మంచు మనోజ్‌కు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే డిసెంబర్ 10వ తేదీన హైదరాబాద్ శివారు జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటికి మనోజ్ వెళ్లాడు. మనోజ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆగ్రహానికి గురైన మనోజ్ గేట్లు బలవంతంగా తోసుకుని ఇంట్లోకి వెళ్లాడు. దీంతో మోహన్ బాబు నివాసంలో ఉద్రిక్త నెలకొంది.
ALSO READ | ఒక్కరోజే టాలీవుడ్ షేక్.. వర్టికల్‌గా డివైడ్ అయిన పొలిటికల్ పార్టీస్
ఈ క్రమంలో మోహన్ బాబు ఇంట్లో జరుగుతోన్న ఈ పరిణామాలను కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మోహన్ బాబు చిందులు తొక్కాడు. విచక్షణ కోల్పోయి ఏకంగా జర్నలిస్టుపై దాడి చేశాడు మోహన్ బాబు. రిపోర్టర్ చేతిలోని మైక్ ను లాక్కొని దాడి చేశాడు. ఈ ఘటనలో రిపోర్ట్ తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి ఘటన రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపింది.
ఈ క్రమంలోనే బాధిత జర్నలిస్ట్ ఫిర్యాదు మేరకు పోలీసులు మోహన్ బాబు అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు. దీంతో మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్‌పై శుక్రవారం (డిసెంబర్ 13) విచారణ చేపట్టిన హైకోర్టు.. మోహన్ బాబు అభ్యర్థనను తిరస్కరించింది. ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.