వైసీపీలోకి మోహన్ బాబు: తెలంగాణ ప్రభుత్వం దాడులు చేయించదు

పంచభూతాల సాక్షిగా చెబుతున్నా..తెలంగాణ ప్రభుత్వం ఎవరిపైనా దాడులు చేయించదు.. చేయించదు.. చేయదు కూడా అని చెప్పారు సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబు. ఎవరికో భయపడి తాను ఈ మాట చెప్పడం లేదని అన్నారాయన. జీవితాంతం తాను ఎవరికీ భయపడనని వివరించిన మోహన్ బాబు.. తప్పుచేసిననాడు ఆత్మహత్య చేసుకుని చనిపోతానని .. ఆ అవసరం తనకు ఎప్పుడూ రాదని అన్నారు.

వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన ఇవాళ వైఎస్సార్ సీపీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బంధువు అన్న కారణంతో వైఎస్ఆర్ సీపీలో చేరలేదని… బంధుత్వం కారణంగానే అయితే మూడేళ్ల కిందటే చేరేవాడినని అన్నారు. తన విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాలేదన్నారు. తన విద్యాసంస్థలను అత్యున్నత ప్రమాణాలతో నడుపుతున్నానని చెప్పారాయన.