మంచు ఫ్యామిలీలో గొడవ జరుగుతుండగా.. ఆ దృశ్యాలను చిత్రీకరించబోయిన మీడియాపై నటుడు మోహన్‌బాబు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రముఖ తెలుగు జర్నలిస్ట్ ఒకరు గాయపడ్డారు. ఈ దాడిని జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. దాడికి పాల్పడ్డ మోహన్‌బాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తాజాగా, ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాడి ఘటనపై మీడియాను ఉద్దేశిస్తూ మోహన్ బాబు ఆడియో రిలీజ్ చేశారు.
నా ఆవేదనను అర్థం చేసుకోండి..
రెండ్రోజుల క్రితం అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన మోహన్ బాబు.. ఆరోగ్యం కుదుటపడటంతో ఇవాళ(గురువారం, డిసెంబర్ 12) డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్ అయిన వెంటనే ఆయన దాడిని ఉద్దేశిస్తూ మీడియాకు ఆడియో సందేశం విడుదల చేశారు. మీడియాపై దాడి చేస్తానని తాను ఎన్నడూ అనుకోలేదన్న మోహన్ బాబు.. దాడి చేయడం తన తప్పేనని, తన ఆవేదనను అర్థం చేసుకోవాలని కోరారు. గాయపడ్డ జర్నలిస్ట్ తన కుటుంబంలో ఒకరిని, తమ్ముడు లాంటి వారని అన్నారు. జరిగిన ఘటనకు బాధపడుతున్నానని తెలిపారు. అతని భార్యాపిల్లలు ఎంత బాధపడుతున్నారో అని తాను ఆలోచిస్తున్నట్లు చెప్పారు.
కుటుంబ సమస్యల్లో జోక్యమెందుకు..?
అదే సమయంలో దాడి ఘటనపై మోహన్ బాబు.. మీడియాకు పలు ప్రశ్నలు సంధించారు. ఇతరుల కుటుంబ సమస్యల్లో ఎవరైనా జోక్యం చేసుకోవచ్చా? అని ఆయన మీడియాను ప్రశ్నించారు. ప్రజలు, నాయకులు దీనిపై ఆలోచించాలని ఆడియోలో కోరారు. గత నాలుగు రోజులుగా పత్రికా చానెళ్లు, విలేకర్లు తన ఇంటి ముందు లైవ్ వ్యాన్లు పెట్టుకుని ఉండటం ఎంతవరకూ సబని ఆయన ప్రశ్నించారు.
కొట్టామని చెప్తున్నారు.. కానీ,
ఈ ఘటనలో తాను దాడి చేశానని చెప్తున్నారే కానీ, సదరు జర్నలిస్ట్ తన నోట్లో మైక్ పెట్టిన విషయాన్ని ఎవరూ ప్రశ్నించడం లేదని మోహన్ బాబు అన్నారు. మైక్ తెచ్చి తన కన్ను దగ్గర పెట్టారని.. కాసింతయ్యి ఉంటే తన కన్ను పోయేదని అన్నారు. తాను దండంపెట్టి చెప్పినా వినిపించుకోలేదన్నారు. ఒక రాజ్యసభ సభ్యుడిగా తాను క్లీన్ చిట్ గా ఉన్నానని అన్నారు. వచ్చిన వాళ్లు మీడియా వాళ్లా? వేరే వాళ్లా అనేది తనకు తెలియదని మోహన్ బాబు అన్నారు.