అన్నను చంపుతానని బెదిరించావ్.. మనోజ్‎తో విభేదాల వేళ సంచలన ఆడియో రిలీజ్ చేసిన మోహన్ బాబు

మంచు ఫ్యామిలీలో రాజుకున్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. మంచు మోహన్ బాబు, మనోజ్ ఒకరిపై మరొకరు పరస్పరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగానే.. 2024, డిసెంబర్ 10వ తేదీన ఈ విభేదాలు కాస్తా దాడుల వరకు వెళ్లాయి. మంగళవారం (డిసెంబర్ 10) రాత్రి జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసానికి వెళ్లిన మంచు మనోజ్ దంపతులను ఇంట్లోని రానివ్వకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో గేట్లు తోసుకుని మోహన్ బాబు ఇంట్లోకి బలవంతంగా వెళ్లాడు మనోజ్. ఈ పరిణామాలతో మోహన్ బాబు నివాసం వద్ద హై టెన్షన్ నెలకొంది. మనోజ్‎తో విభేదాలు పీక్స్‎కు చేరిన వేళ మోహన్ బాబు సంచలన ఆడియో రిలీజ్ చేశారు. ఈ ఆడియోలో మనోజ్, విభేదాల గురించి మాట్లాడారు మోహన్ బాబు. 

‘‘మనోజ్‌.. అందరికంటే ఎక్కువగా నిన్ను అల్లారుముద్దుగా పెంచాను.. నీ చదువు కోసం చాలా ఖర్చు పెట్టాను.. నువ్వు ఏది అడిగినా ఇచ్చా. కానీ నీ ప్రవర్తనతో నా మనసు కుంగిపోతుంది. భార్య మాటలు విని నువ్వు నా గుండెలపై తన్నావ్.. తాగుడుకు అలవాటు పడి చెడు మార్గంలో వెళ్తున్నావు.. మద్యం మత్తులో ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నావ్. ఇంట్లో పని చేసే వారిపై దాడికి దిగడం సరికాదు. నీ వల్ల మీ అమ్మ  ఆసుపత్రిలో చేరింది. అన్నను చంపుతానని బెదిరించావ్. జల్ పల్లిలోని ఇల్లు నా కష్టార్జితం. నా ఇంట్లోకి అడుగుపెట్టే అధికారం నీకు లేదు. తప్పు చేయనని చెప్పి మళ్లీ ఇంట్లోకి వచ్చావు. ఇక చాలు.. ఇంతటితో గొడవకు ముగింపు పలుకుదాం. 

ALSO READ | మోహన్ బాబు ఇంటి దగ్గర జర్నలిస్టుల ఆందోళన.. క్షమాపణ చెప్పాలని డిమాండ్

ఇంట్లో అడుగు పెట్టడానికి నీకు అధికారం లేదు. నన్ను ఎవరూ మోసగాడు అనలేదు. నా వ్యాపారాలు అన్ని లీగల్ గానే జరుగుతున్నాయి. కానీ నువ్వు రోడ్డెక్కి నా పరువు, ప్రఖ్యాతలు మంటగిలిపావు. నీకు జన్మనివ్వడమేనా నేను చేసిన పాపం. మా నాన్న నాకు ఏం ఆస్తులు ఇవ్వలేదు.. నేను కష్టపడి సంపాదించా. నా ఆస్తులు ముగ్గురికి సమానంగా ఇవ్వాలా వద్దా అనే నా ఇష్టం. ఆస్తులు వారసులకు ఇస్తానా.. లేక దానధర్మాలు చేస్తానా అనేది నా ఇష్టం. మనోజ్ నాపై దాడి చేయలేదు. కొన్ని కారణాల వల్ల ఇద్దరం ఘర్షణ పడ్డాం.. ప్రతి ఇంట్లో గొడవలు ఉంటాయి’’ అని మోహన్ బాబు ఆడియోలో పేర్కొన్నారు.