మోహన్ బాబుకు మళ్లీ నోటీస్ ఇస్తాం : సుధీర్ బాబు

మోహన్ బాబుకు మళ్లీ నోటీస్ ఇస్తాం : సుధీర్ బాబు
  • రాచకొండ సీపీ సుధీర్ బాబు

ఎల్బీనగర్, వెలుగు:  సినీ నటుడు మోహన్ బాబు ఫ్యామిలీ కేసులో తాము లీగల్ గా ముందుకెళ్తున్నామని, ఇప్పటివరకు మూడు ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. సోమవారం ఎల్బీనగర్​లోని సీపీ క్యాంప్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. మంచు కుటుంబ వివాదానికి సంబంధించి నమోదైన కేసులపై దర్యాప్తు చేస్తున్నామన్నారు. మోహన్ బాబు అరెస్ట్ విషయంలో ఆలస్యమేమీ లేదని, ఈ నెల 24వ తేదీ వరకు కోర్టు ఆయనకు టైం ఇవ్వడంతో అరెస్ట్ చేయలేదని చెప్పారు.

ఆయనను విచారించేందుకు తాము కోర్టు అనుమతి కోరుతామన్నారు. మోహన్ బాబు వద్ద ఉన్న గన్​లకు తాము లైసెన్స్ ఇవ్వలేదని, ఏపీలోని చంద్రగిరిలో ఉన్నపుడు ఆయన తీసుకున్నవేనని చెప్పారు. ఆయన వద్ద మొత్తం 2 లైసెన్స్​డ్  గన్స్ ఉన్నాయన్నారు. కోర్టు మినహాయింపు అయిపోయాక మోహన్ బాబుకు మరోసారి నోటీసులు ఇస్తామని.. అప్పుడు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పారు. పోలీసుల ముందు హాజరయ్యేందుకు టైం కావాలంటే ఆయన పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. లేదంటే మోహన్ బాబుకు అరెస్ట్ వారంట్ జారీ చేస్తామని చెప్పారు.