హైదరాబాద్: మీడియాపై దాడి చేసిన ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. తన ఇంటి వద్ద కవరేజ్ కోసం వచ్చిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేయడాన్ని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మల్లన్న ఖండించారు. ‘‘మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి. అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి చేయడం మరీ దారుణం.. సిగ్గుచేటు అమానుషం’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, 2024, డిసెంబర్ 10వ తేదీన జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
మోహన్ బాబు నివాసానికి ఆయన కుమారుడు మనోజ్ వచ్చాడు. విభేదాల నేపథ్యంలో మనోజ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా మోహన్ బాబు సిబ్బంది గేట్లు క్లోజ్ చేశారు. సిబ్బందితో వాగ్వాదానికి దిగిన మనోజ్.. చివరకు గేట్లు తోసుకుని బలవంతంగా ఇంట్లోకి వెళ్లాడు. మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఈ హైడ్రామాను కవరేజ్ చేసేందుకు మీడియా వెళ్లింది. ఈ క్రమంలోనే ఇంట్లోకి వచ్చిన మీడియా ప్రతినిధులపై మోహన్ బాబు దాడికి పాల్పడ్డాడు.
ALSO READ | మోహన్ బాబుకు అస్వస్థత.. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన విష్ణు
బూతులు తిడుతూ జర్నలిస్టుల చేతిలోని మైక్‌ను తీసుకుని దాడి చేశాడు. మోహన్ బాబు దాడిలో ఇద్దరు జర్నలిస్టులు గాయపడ్డారు. దీంతో మీడియాపై దాడికి పాల్పడిన మోహన్ బాబుపై పలువురు జర్నలిస్టులు, మీడియా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అహంకారిపూరిత ధోరణితో దాడికి పాల్పడిన ఆయనపై చర్యలు తీసుకోవాలని.. అరెస్ట్ చేయాలని పలువురు జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే ఆందోళనకు దిగుతామని ఇప్పటికే పలు జర్నలిస్టు సంఘాలు హెచ్చరించాయి.
మీడియా పై దాడి చేసిన మోహన్ బాబు ను తక్షణమే అరెస్ట్ చేయాలి . అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధి పై దాడి చేయడం మరీ దారుణం . సిగ్గుచేటు అమానుషం
— Teenmar Mallanna (@TeenmarMallanna) December 10, 2024
#arrestmohanbabu @TV9Telugu @V6News