
కుభీర్, వెలుగు: సీఎం కేసీఆర్‌కు వైన్స్ ఆదాయం పెంచడంలో ఉన్న శ్రద్ధ రాష్ట్రంలోని విద్యావ్యవస్థపై లేదని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్ అన్నారు. పల్లెపల్లెకు బీజేపీ– గడప గడపకు మోహన్ రావు పటేల్ కార్యక్రమంలో భాగంగా బుధవారం కుభీర్‌లో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ముద్రించిన క్యాలెండర్ ను అందజేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టీచర్లు, బుక్స్ లేక వెలవెలబోతున్నాయని వాపోయారు. ముందుగా శ్రీ విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి జీప్ అడ్డాలో బీజేపీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గంగాధర్, నాయకులు వెన్నెల నాగేందర్, దత్తాత్రి, గంగ శేఖర్, కమలేశ్, పండిత్ జాదవ్, కనకయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు.