పశువుల కాపర్లపై బీఆర్ఎస్ లీడర్ దాడి

ప్రజా సంఘాల ఆగ్రహంతో బహిరంగ క్షమాపణ 

ధర్మారం,వెలుగు :  పశువుల కాపర్లపై దాడి చేసిన వివాదంలో  బీఆర్ఎస్  లీడర్ గుర్రం మోహన్ రెడ్డి సోమవారం ధర్మారం మార్కెట్ యార్డ్ లో బాధితులకు బహిరంగ క్షమాపణ చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ధర్మారం మాజీ మండల అధ్యక్షుడు,  వ్యవసాయ మార్కెట్ మాజీ  చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి వారం రోజుల కింద తన బైక్ కు గేదె తగిలిందనే కారణంతో పశువుల కాపర్లు పుట్ట లచ్చయ్య, మారం రాయమల్లుపై దాడి చేశాడు. బాధితులు మోహన్ రెడ్డిపై అదే రోజు పోలీసు స్టేషన్​ లో  ఫిర్యాదు చేశారు.  

కాగా మోహన్ రెడ్డి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రధాన అనుచరుడు కావడంతో శ్రీరామనవమి రోజు బాధితుల ఇంటికి మంత్రి స్వయంగా వెళ్లి వారిని పరామర్శించి రెండు రోజుల్లో మోహన్ రెడ్డితో క్షమాపణ చెప్పిస్తానని హామీ ఇచ్చారు.  బాధితులకు పది వేల రూపాయల ఆర్థిక సాయం కూడా అందజేశారు. మూడు రోజులు గడిచిన మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పకపోవడంతో బాధితులతో పాటు రైతులు, వివిధ కుల సంఘాల ప్రజలు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాలతో  సోమవారం మోహన్ రెడ్డి బాధితులకు బహిరంగ క్షమాపణ చెప్పారు.