
చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను వాడుకుని ఆ కుటుంబంను నాశనం చేశాడని తెలిపారు సినీ నటుడు మోహన్ బాబు. వైస్రాయ్ హోటల్ దగ్గర దివంగత సీఎం ఎన్టీఆర్ పై చెప్పులు వేయడం వాస్తవమని, అది తాను చూశానన్నారు. ‘నేను చేసిన తప్పెంటో చెప్పండి బ్రదర్.. తప్పు సరిద్దిదుకుంటాను’ అని వేడుకున్న అన్నగారిపై చంద్రబాబు చెప్పులు వేయించారని తెలిపారు. సోమవారం మంగళగిరిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణరెడ్డితో కలిసి మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. నాయకులందరినీ చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటారని, అబద్ధాలు మాట్లాడటం చంద్రబాబు రక్తంలో జీర్ణించుకు పోయిందన్నారు.
‘ప్రస్తుతం ఉన్న టీడీపీ అన్నయ్య(ఎన్టీఆర్)ది కాదు.. చంద్రబాబు ఆక్రమించిన పార్టీ. అన్నయ్యేదే అయితే నేను పార్టీ వీడేవాడినే కాదు. ఆ మహానేత పార్టీనే ఆక్రమించి ఆయన సభ్యత్వాన్నే తీసేసిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వనాశనం చేశారు. హరికృష్ణ, తారక్, సుహాసినిలను వాడుకుని వదిలేశారు. ఎవరైనా బాగుంటే చాలు.. వారిని నాశనం చేసే వరకు చంద్రబాబు వదలరని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గెలుపు ఖాయం అని దాన్ని ఎవరు అపలేరన్నారు. నిజాయితీ కలిగిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై విమర్శలు చేసే చంద్రబాబు తన కారెక్టర్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నారన్నారు.