
మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన ఎల్ 2 ఎంపురాన్ (L2 Empuraan) గురువారం (2025 మార్చి 27న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు ఇది సీక్వెల్. హీరో పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు కీలకపాత్ర పోషిస్తున్నాడు. మురళి గోపి కథను అందించారు. తెలుగులో దిల్ రాజు విడుదల చేశాడు.
సినిమా రిలీజ్ కు ముందే భారీ ప్రమోషన్స్ తో అంచనాలు పెంచారు మేకర్స్. లూసిఫర్ మూవీకి ఈ సీక్వెల్, ఏ మాత్రం తగ్గదంటూ మేకర్స్ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చారు. ఆడియన్స్ ఎన్ని అంచనాలు పెట్టుకున్నా అంతకుమించిన పొలిటికల్ థ్రిల్లర్ చూడబోతున్నారు అంటూ కాన్ఫిడెంట్ తో వచ్చారు. మరి వారి అంచనాలను ఈ సీక్వెల్ అందుకుందా? ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.
కథేంటంటే:
‘లూసిఫర్’ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే ఈ కథ మొదలవుతుంది. పీకే రామదాస్ (సచిన్ ఖేడ్కర్) మరణానంతరం ఐయూఎఫ్ పార్టీలో చెలరేగిన అలజడులన్నింటినీ సద్దుమణిగేలా చేసాక, తన తమ్ముడైన జతిన్ రామ్‌దాస్ ను (టోవినో థామస్) ముఖ్యమంత్రిని చేసి విదేశాలకు లూసిఫర్ స్టీఫెన్ నడింపల్లి (మోహన్‌లాల్) అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత అధికారం చేతికొచ్చాక జతిన్ రామ్‌దాస్ తన వక్రబుద్ధిని చూపెడతాడు. సొంత ప్రయోజనాల కోసం దేశ రాజకీయాలను శాసిస్తున్న మతతత్వ వాది బాబా భజరంగి (అభిమన్యు సింగ్)తో కలిసి తాను పనిచేయబోతున్నామని ప్రకటిస్తారు.
Also Read : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ సినిమా స్టోరీ లీక్
జతిన్‌ను అడ్డం పెట్టుకుని కేరళలోని వనరులను భజరంగి కొల్లగొట్టాలనుకుంటాడు. అయితే జతిన్ నిర్ణయాన్ని అక్క ప్రియదర్శి (మంజు వారియర్)తో పాటు పీకేఆర్ పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తారు. వాళ్ళు చేపట్టిన అక్రమ పనులను ఆపడానికి సీఎంకి వ్యతిరేకంగా వెళ్తుంది. దీంతో ఆమెని చంపేందుకు జతిన్ ప్రయత్నిస్తాడు. ఇక అక్కడ రాజకీయ అల్లర్లు చెలరేగడం, పార్టీ అస్తవ్యస్తం అవ్వడం మొదలవ్వతుంది.
అప్పుడు రాష్ట్రంలోకి లూసిఫర్ స్టీఫెన్ అడుగెట్టాల్సిన పరిస్థితి వస్తోంది. స్టీఫెన్ వచ్చాక జతిన్, బాబా భజరంగి అవినీతిని ఎలా అరికట్టాడు? ఐదేళ్లు కేరళ వదిలి విదేశాలకు ఎందుకు వెళ్ళాడు? స్టీఫెన్ గట్టుపల్లి అబ్రహం ఖురేషి ఎలా అయ్యాడు? భజరంగికి జయేద్ మసూద్ (పృథ్విరాజ్ సుకుమార్) మధ్య ఉన్న శత్రుత్వం ఏంటి? అనే తదితర విషయాలు తెలియాలంటే ఎల్ 2 ఎంపురాన్ మూవీని థియేటర్లో చూడాల్సిందే.
ఎలా ఉందంటే:
సినిమా విడుదలకు ముందే పాన్ ఇండియన్ వైడ్‌గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఎల్ 2 ఎంపురాన్. దానికి కారణం ఆరేళ్ల క్రితం వచ్చిన లూసిఫర్. దానికి ఏ మాత్రం తగ్గకుండా ట్రైలర్ లో చూపించిన సీన్స్ ను బట్టి పాజిటివ్ వైబ్ అమాంతం సొంతం చేసుకుంది.
సినిమా విడుదలయ్యాక చూసుకుంటే.. పృథ్వీరాజ్ సుకుమారన్ గ్రిప్పింగ్‌గా స్టోరీని రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ ఫైర్‌లా, సెకండాఫ్ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఆడియెన్స్‌కు థ్రిల్ ఇచ్చేలా ఉంది. మోహన్ లాల్ ఎంట్రీ సీన్ తో పాటు, ఇంటర్వెల్,క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ స్టాండర్స్‌లో ఉన్నాయి. ట్విస్ట్‌లు, ఎలివేషన్లతో మరింత హై ఫీలింగ్ ఇచ్చేలా సినిమా సాగింది. పూర్తి విశ్లేషణకు వెళ్తే..
ఫస్టాఫ్ లో.. అధికారం, దురాశ, ద్రోహం, ప్రతీకారంతో ఆధిపత్యం చెలాయించే ఎంపురాన్ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు డైరెక్టర్ పృథ్విరాజ్. పీఆకేఆర్ వారసత్వంగా వచ్చిన జితిన్ తప్పుదారి పట్టడం, రాష్ట్రాన్ని అవినీతి మయంగా చేసి తాను స్వలాభం పొందే ప్రయత్నం చేయడం, ఈ క్రమంలో జరిగే ప్రతి విషయం 'లూసిఫర్' దృష్టికి రావడంతో ఆసక్తి మొదలవ్వతుంది.
సినిమా మొదలైన నలభై నిమిషాలకు మోహన్ లాల్ ఎంట్రీ ఇవ్వడంతో కథ మరింత రక్తి కట్టడం షురూ అవుతుంది. ఫస్టాఫ్ లో ఉండాల్సిన డ్రామా తో పాటు ఎమోషన్స్ తోడవ్వడం సినిమాకు బలాన్ని ఇచ్చేలా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని కలిగిస్తుంది. అక్కడ ట్విస్ట్ తో కూడిన సీన్ ఆడియన్స్ కు ఉత్కంఠని కలిగిస్తుంది. అది సెకండాఫ్ పై క్యూరియాసిటీ క్రియేట్ అయ్యేలా చేస్తోంది.
సెకండాఫ్ లో.. రక్షకుడైన స్టీఫెన్ నడింపల్లిగా మోహన్‌లాల్, ఎదిగే క్రమాన్ని ఈ సారి వైల్డ్ గా చూపించాడు పృథ్వీరాజ్. ముఖ్యంగా డ్రగ్ మాఫియా, జిహాదీ గ్రూపులు K-A (ఖురేష్ అబ్ రామ్) ఎంట్రీతో వచ్చే ఎలివేషన్స్, విజువల్స్ ఆసక్తిగా ఉన్నాయి. అలాగే కేరళ రాజకీయాల్లో మొదలైన అలజడిని చూపిస్తూనే ట్విస్ట్ లను చివర్లో రివీల్ చేయడం ఎంగేజింగ్ గా ఉంది. క్లైమాక్స్‌లో మోహల్ లాల్, పృథ్విరాజ్ కలిసి చేసే ఫైటింగ్ సీన్ ఫ్యాన్స్ చేత ఈలలు వేయిస్తుంది. సీక్వెల్ 3పై పెట్టిన సస్పెన్స్ ఆసక్తి కలిగిస్తోంది.
ఎవరెలా చేశారంటే:
మోహన్‌లాల్ నటనలో సూపర్ స్టార్. ఈ సినిమాకు కూడా తనదైన నటనతో ప్రాణం పోశాడు. స్టీఫెన్‌గా, ఖురేషి అబ్రాన్‌గా రెండు పాత్రల్లో కనిపించి కథను రక్తి కట్టించాడు. సినిమాకు వన్ మేన్ షోగా మోహన్‌లాల్ నటన ఉంది. టొవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్,ఇంద్రజిత్ సుకుమారన్, డైరెక్టర్ పృథ్విరాజ్ తమ తమ బలమైన పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతిక అంశాలు:
యాక్టర్ కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేశాడు. లూసిఫర్-2 కథా పరంగా కొత్తదేం కానప్పటికీ తనదైన శైలి ట్విస్టులు,ఎలివేషన్స్ రాసుకుని సక్సెస్ అయ్యాడు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ అదిరిపోయింది. దీపక్ దేవ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలం. ఇంటర్వెల్ ఎపిసోడ్, చర్చి ఫైట్, ఫారెస్ట్ ఫైట్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గూస్‌బంప్స్ అనేలా ఉంది. రైటర్ మురళీ గోపీ 'లూసిఫర్' తరహాలో స్క్రిప్టును అందించినప్పటికీ, కథలో ఎమోషన్స్ లేకపోవడం కాస్తా మైనస్ అనిపించేలా ఉంది. అఖిలేశ్ మోహన్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు పెట్టిన ప్రతి పైసా సినిమా ఉన్నతిని చూపిస్తుంది. హాలీవుడ్ రేంజ్ లో తీశారు.