స్నేహమంటే ఇదేరా: శబరిమల అయ్యప్ప సన్నిదిలో మమ్ముట్టీ కోసం మోహన్‌ లాల్‌ ప్రత్యేక పూజలు

స్నేహమంటే ఇదేరా: శబరిమల అయ్యప్ప సన్నిదిలో మమ్ముట్టీ కోసం మోహన్‌ లాల్‌ ప్రత్యేక పూజలు

మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కోసం సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రత్యేక పూజలు చేశారు. మంగళవారం (మార్చి 18న) శబరిమల అయ్యప్ప సన్నిదిలో మమ్ముట్టీ కోసం మోహన్‌ లాల్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం గణపతి కోవిల్ నుండి 'ఇరుముడికెట్టు'ను మోసుకెళ్లి కొండపైకి ఎక్కారు. నేడు బుధవారం ఉదయం అయ్యప్ప ఆలయంలో 'నెయ్యభిషేకం' నిర్వహించాడు. 

అక్కడ మోహన్‌ లాల్‌ 'తన కుటుంబ సభ్యులతో పాటు తన ఆప్త మిత్రుడు మమ్ముట్టీ పేరు మీద పూజ చేయించడంతో పాటుగా ప్రత్యేక నైవేద్యం సమర్పించారు. మమ్ముట్టీ అసలు పేరు మహ్మద్‌ కుట్టి పేరు చెప్పడంతో పాటు, ఆయన నక్షత్రం విశాఖ అని చెప్పి ప్రత్యేకంగా పూజ చేయించాడు. అయితే, మోహన్‌ లాల్‌ 'ఉషా పూజ'ను నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఇటీవల, మమ్ముట్టి ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నారని పత్రిక కథనాల్లో కొన్ని పుకార్లు వచ్చాయి. ఈ క్రమంలో మమ్ముట్టీ కోసం మోహన్‌ లాల్‌ ప్రత్యేక పూజలు నిర్వహించడం మరింత చర్చనీయాంశం అయింది. ప్రస్తుతం మోహన్ లాల్ శబరిమల సందర్శన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

ఈ నేపథ్యంలో మమ్ముట్టి అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్నారంటూ వస్తున్న కథనాలపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ‘మమ్ముట్టి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. రంజాన్‌ కారణంగా ఆయన షూట్స్‌ నుంచి బ్రేక్‌ తీసుకొని వెకేషన్‌కు వెళ్లారు. విరామం నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఆయన మోహన్‌లాల్‌తో కలిసి మహేశ్‌ నారాయణన్‌ మూవీలో పాల్గొననున్నారు’’ అని టీమ్‌ వెల్లడించింది. 

ALSO READ | SSMB29 స్టోరీ లీక్.. గ్రోక్ ఇంత సింపుల్ గా చెప్పేసిందేంటీ.

మోహన్‌ లాల్‌, మమ్ముట్టీల మధ్య ఉన్న స్నేహం ఇప్పటిది కాదు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా వీరి స్నేహం చెక్కుచెదరకుండా కొనసాగుతూ ఉంది. వీరిద్దరూ కలిసి పలు సినిమాల్లో నటించడంతో పాటు సామజిక కార్యక్రమాల్లో కూడా పాలుపంచుకున్నారు.

ఇప్పుడు మోహన్‌ లాల్‌ ఏకంగా శబరిమలకు వెళ్లి మమ్ముట్టీ కోసం ప్రత్యేక పూజలు చేయడం పట్ల ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. స్నేహమంటే ఇదేరా.. అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత శబరిమల కొండను సందర్శించారు. ఆయన చివరిసారిగా 2015లో తన సూపర్ హిట్ చిత్రం 'పులిమురుగన్' విడుదలైన సమయంలో ఈ ఆలయాన్ని సందర్శించారు.

ఇకపోతే, మోహన్ లాల్ లూసిఫర్‌కి సీక్వెల్‌గా వస్తోన్న 'L2E:ఎంపురాన్' విడుదల నేపథ్యంలో ఆయన శబరిమల సందర్శించారు. ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ మరియు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన 'ఎంపురాన్' మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ పాన్-ఇండియన్ చిత్రం మలయాళం, తమిళం, తెలుగు, హిందీ మరియు కన్నడ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. నటుడు పృథ్వీరాజ్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మురళి గోపి రచన చేశారు.