దోషులకు శిక్ష తప్పదు..మాలీవుడ్​లో లైంగిక వేధింపులపై మోహన్ లాల్

దోషులకు శిక్ష తప్పదు..మాలీవుడ్​లో లైంగిక వేధింపులపై మోహన్ లాల్
  • జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్​ను స్వాగతించిన యాక్టర్ 
  • కొందరి తప్పులకు అందరిని బాధ్యులను చేయొద్దని విజ్ఞప్తి

తిరువనంతపురం : మలయాళ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు, మహిళా టెక్నీషియన్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన దోషులకు శిక్ష తప్పదని ప్రముఖ నటుడు, అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్‌‌‌‌‌‌‌‌(అమ్మ) మాజీ అధ్యక్షుడు మోహన్ లాల్ అన్నారు. ఇండస్ట్రీలో కొందరు చేసిన తప్పులకు అందరినీ బాధ్యులను చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ వ్యవహారంలో దర్యాప్తు జరుగుతోందని, తప్పు చేసిన వ్యక్తులకు వ్యతిరేకంగా ఆధారాలు ఉంటే తప్పకుండా శిక్ష పడుతుందన్నారు. 

మాలీవుడ్​లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి జస్టిస్ హేమ కమిటీ రిపోర్టును ఇటీవల ప్రభుత్వం విడుదల చేయడంతో ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున ‘మీటూ’ ఉద్యమం మొదలైంది. ఎంతో మంది హీరోయిన్లు, మహిళా టెక్నీషియన్లు తమపై కూడా లైంగిక వేధింపులు జరిగాయని వరుసగా బయటపెడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రముఖ నటుడు సిద్దిఖ్, డైరెక్టర్ రంజిత్ బాలకృష్ణన్, సీపీఎం ఎమ్మెల్యే, నటుడు ఎం. ముకేశ్ సహా17 మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. రంజిత్ పై రెండో కేసు కూడా ఫైల్ అయింది.

 ఈ వ్యవహారంపై మోహన్ లాల్ శనివారం మీడియా ముందు స్పందించారు. మాలీవుడ్​లో వేలాదిమంది నటీనటులు, టెక్నీషియన్లు పనిచేస్తున్నారని, ఇది చాలా పెద్ద ఇండస్ట్రీ అని అన్నారు. జస్టిస్ హేమ కమిటీ రిపోర్టును బయటపెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన మెచ్చుకున్నారు. మాలీవుడ్​ను నమ్ముకుని వేలాది కుటుంబాలు జీవిస్తున్నాయని, అందరినీ తప్పు పట్టి పరిశ్రమను నాశనం చేయొద్దన్నారు. మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో నైతిక బాధ్యత వహిస్తూ ‘అమ్మ’ అధ్యక్ష పదవికి మోహన్ లాల్ ఇటీవల రాజీనామా చేశారు.

ముకేశ్ రాజీనామా చేయక్కర్లేదు : సీపీఎం 

మలయాళ నటుడు, సీపీఎం ఎమ్మెల్యే ఎం. ముకేశ్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ నటి ఇటీవల కేసు పెట్టిన నేపథ్యంలో అతడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్, బీజేపీ మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేయాల్సిన అవసరం లేదని శనివారం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి గోవిందన్ స్పష్టం చేశారు. 

నైతిక బాధ్యత వహిస్తూ అతను రాజీనామా చేసిన తర్వాత.. నిర్దోషిగా తేలితే ఎమ్మెల్యే పదవి తిరిగి వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో 16 మంది ఎంపీలు, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు పాల్పడినట్టు కేసులు ఉన్నాయని, వారిలో ఎవరూ కూడా రిజైన్ చేయలేదన్నారు.

కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డింగ్ ​: రాధిక

సినిమా సెట్​లో నటీ నటులకు ప్రైవేట్ ప్లేస్​గా ఉండే కారవాన్​లోనూ సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు చిత్రీకరించారంటూ నటి రాధికా శరత్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. మాలీవుడ్ లోనే కాకుండా చాలా ఇండస్ట్రీల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నాయన్నారు. కొందరు వ్యక్తులు నటీమణుల కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి.. ప్రైవేట్ వీడియోలు చిత్రీకరించిన సందర్భాలు ఉన్నాయన్నారు. సినీ ఇండస్ట్రీలో మహిళలు ఇలాంటి ఘటనలు ఎదుర్కోవడం బాధాకరమన్నారు. ‘‘46 ఏండ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. ఒక సినిమా కోసం కేరళ వెళ్లినప్పుడు చోటుచేసుకున్న ఘటనను ఎప్పటికీ మర్చిపోను.

 షాట్ ముగించుకుని వెళ్తుండగా సెట్లో కొంతమంది మగవాళ్లు ఒకచోట కూర్చొని ఫోన్లో ఏదో చూస్తూ నవ్వుకుంటున్నారు. ఒక వ్యక్తిని పిలిచి ఏంచూస్తున్నారని అడిగితే.. కారవాన్లలో సీక్రెట్ కెమెరాలు పెట్టి రికార్డు చేసిన వీడియోలను ఫోన్లో చూస్తున్నారని తెలిసింది. దీనిపై చిత్ర బృందానికి ఫిర్యాదు చేశా. కారవాన్​లో  హిడెన్ కెమెరాలు పెడితే తగిన బుద్ధి చెబుతానని ఆ టీంకు వార్నింగ్ ఇచ్చా. ఆ తర్వాత కారవాన్ ఉపయోగించాలంటేనే నాకు భయమేసింది’’ అని రాధిక తెలిపారు.