Mohsin Naqvi: ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్

Mohsin Naqvi: ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్

పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జై షా స్థానంలో మొహ్సిన్ నఖ్వీ ఈ బాధ్యతలను స్వీకరిస్తారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్‌గా జై షా ఎంపికైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్ పదవులను వదులుకోవాల్సి వచ్చింది. 2024 ప్రారంభం నుండి నఖ్వీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ పదవిలో ఉన్నారు. ఇప్పుడు ఆయన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ పదవితో పాటు ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా కొనసాగనున్నాడు. 

నఖ్వీ పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఉన్నప్పుడు పాకిస్తాన్ 29 సంవత్సరాలలో తొలిసారి ఐసీసీ టోర్నమెంట్‌ను నిర్వహించింది. అంతేకాదు వారి క్రికెట్ స్టేడియాలు పునరాభివృద్ధిని కూడా ప్రారంభించింది. అయితే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన పీసీబీ చైర్మన్ గా కొనసాగవచ్చా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకేసారి రెండు పదవులు నిర్వహించడం సాధ్యమవుతుందా అనే అపోహలు ఉన్నాయి. ఈ విషయంపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ నిబంధనల ప్రకారం, ACC అధ్యక్షుడు మరొక సంస్థలో కూడా పదవిని కలిగి ఉండవచ్చు. 

గతంలో జై షా కూడా బీసీసీఐ కార్యదర్శిగా పని చేస్తూనే ACC చైర్మన్ గా వ్యవహరించాడు. పాకిస్తాన్ క్రికెట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోకపోతే, నఖ్వీ ఇప్పటికీ పదవిలో కొనసాగవచ్చు. ఈ సంవత్సరం మెన్స్ ఆసియా కప్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ టోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ హైబ్రిడ్ మోడల్‌లో జరిగే అవకాశం కనిపిస్తుంది.